ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
11 గంటల వరకు ఫలితం వెల్లడి
ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు
అత్యధికంగా భూపాలపల్లిలో 22 రౌండ్లు..
తక్కువగా వరంగల్ తూర్పులో 16 రౌండ్ల లెక్కింపు
విధుల్లో 600 మంది ఉద్యోగులు
హన్మకొండ అర్బన్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. 11 గంటల వరకు తుది ఫలితం వెలువడుతుందని చెప్పారు. కౌంటింగ్ విధుల్లో 600 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కోదానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. మొదట 14 ఈవీఎంలు స్ట్రాంగ్ రూం నుంచి తీసుకొచ్చి ఒక్కో టేబుల్‌పై ఒక్కొక్కటి చొప్పున లెక్కిస్తారు. ఆ తర్వాత మరో 14.. ఇలా అన్ని ఈవీఎంలు లెక్కిస్తారు. చివరకు రెండు ఈవీఎంలను లెక్కించినా దాన్ని కూడా ఒక రౌండ్‌గానే పరిగణిస్తారు. ఒక రౌండ్ లెక్కింపునకు సుమారు 10 నిమిషాలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. అభ్యర్ధుల కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, బారికేడ్లు, కౌంటింగ్ హాల్‌లో జాలీలు ఏర్పాటు చేశారు. సమాచారం అందజేసేందుకు కౌంటింగ్ కేంద్రం వద్ద ప్రత్యేకంగా మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
ప్రతి రౌండ్‌కు ఫలితాలను ప్రకటిస్తారు. ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు సహా మొత్తం 23 మంది బరిలో ఉన్నారు.
పోలైన ఓట్లు 10, 35,656...
ఉప ఎన్నికలో మొత్తం 15,09,671 ఓట్లకు గాను 1788 కేంద్రాలలో 10,35,656 ఓట్లు (69.19 శాతం) పోలయ్యాయి. భూపాలపల్లి అసెంబ్లీ పరిధిలో 297 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఆ నియోజకవర్గానికి సంబంధించి 22 రౌండ్లలో లెక్కింపు జరుగనుంది. ఆ తర్వాత అధికంగా 274 కేంద్రాలు స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఉండగా, అక్కడ 19 రౌండ్లు కౌంటింగ్ చేయనున్నారు. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలున్న వరంగల్ తూర్పు నియోజకవర్గ లెక్కింపు 16 రౌండ్లలో ముగియనుంది. రౌండ్ల వారీ ఫలితాలను ఏఆర్‌ఓలు వెల్లడించనుండగా, తుది ఫలితాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ కరుణ ప్రకటిస్తారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్లు..
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం 500 మందికి పోస్టల్ బ్యాలెట్స్ పంపగా కేవలం 126 మాత్రమే తిరిగి వచ్చారుు. వీటి లెక్కింపు తర్వాత రౌండ్ల వారీగా మిగితా ఓట్లు కౌంట్ చేస్తారు.
నేడు లెక్కింపు
Published Tue, Nov 24 2015 1:45 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM
Advertisement
Advertisement