ప్రాముఖ్యం
చైత్ర శుద్ధపాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారం ధరించిన విష్ణుమూర్తి సోమకున్ని సంహరించి వేదాలను బ్రహ్మాకు అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.
పూజ
అన్ని పండుగల మాదిరిగానే ఉగాది రోజున ఉదయం 9గంటల లోపు తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఏదో ఒక దేవాలయానికి వెళ్లి పూజలు చేస్తారు. అనంతరం ఏమీ తినక ముందే ఉగాది పచ్చడిని తింటారు.
పచ్చడి
‘ఉగాది పచ్చడి’ ఈ పండుగకు మాత్రమే తినే ప్రత్యేక పదార్థం. షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తింటారు. ఏడాదిపాటు ఎదురయ్యే మంచిచెడులు, కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. పచ్చడి తయారీకి మామిడి కాయలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం, వేపపువ్వు వాడుతారు. బె ల్లం-ఆనందానికి, ఉప్పు-ఉత్సాహం, వేపపువ్వు-బాధ కలిగించే అనుభవాలు, పులుపు-నేర్పుగా వ్యవహారించాల్సిన పరిస్థితులు, మామిడి-కొత్త సవాళ్లు, కారం-సహనం బావానికి ప్రతీక.
పంచాంగ శ్రవణం
కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహ శాంతి వంటివి జరిపించుకుని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణం చేస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి, వ్యవసాయం ఎలా ఉంటుంది, అనే విషయాలను తెలుసుకోడానికి పంచాంగ శ్రవణం చేసేవారని చెబుతారు.
నేడు ఉగాది పర్వదినం షడ్రుచుల సమ్మేళనం
Published Mon, Mar 31 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM
Advertisement
Advertisement