భూసేకరణ చట్టాన్ని తొక్కిపెట్టి ఆర్డినెన్సు | Tokkipetti the Land Acquisition Act Ordinance | Sakshi
Sakshi News home page

భూసేకరణ చట్టాన్ని తొక్కిపెట్టి ఆర్డినెన్సు

Published Tue, Apr 14 2015 1:55 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

భూసేకరణ చట్టాన్ని తొక్కిపెట్టి ఆర్డినెన్సు - Sakshi

భూసేకరణ చట్టాన్ని తొక్కిపెట్టి ఆర్డినెన్సు

  • భూసేకరణ ఆర్డినెన్సుపై పీసీసీ పుస్తకం
  • రైతాంగానికి ముప్పు తెస్తున్న బీజేపీ ప్రభుత్వం
  • సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్సు రైతాంగానికి ముప్పుగా పరిణమించిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. ‘రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసిన భూసేకరణ చట్టం-2013, హక్కులను హరిస్తున్న బీజేపీ ఆర్డినెన్సు’ అనే పుస్తకాన్ని గాంధీభవన్‌లో సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, నేతలు ఎం.కోదండరెడ్డి, లక్ష్మణ్‌రావుతో కలసి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

    రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే భూసేకరణ చట్టం-2013ను అమలు చేయకుండా, బీజేపీ ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్సును తీసుకువచ్చిందని విమర్శించారు. రైతు సంక్షేమం, అభివృద్ధి, ప్రయోజనాలపై లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే యూపీఏ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి రూపకల్పన చేసిందన్నారు. కానీ, బీజేపీ ప్రభుత్వం ఆ చట్టాన్ని తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఆర్డినెన్సును తెచ్చిందని విమర్శించారు.

    భూములపై, పరిహారం కోరడంపై హక్కులేకుండా చేసిన ఆర్డినెన్సును దేశవ్యాప్తంగా రైతాంగం వ్యతిరేకిస్తోందని చెప్పారు. పాత చట్టంలో ఏమున్నదో, కొత్త ఆర్డినెన్సుతో నష్టం ఏమిటో తెలంగాణ ప్రాంత రైతాంగానికి తెలియజెప్పేందుకు మండలస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
     
    సోనియా పాత్రను పాఠ్యాంశంలో చేర్చాలి

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ చేసిన కృషిని తెలంగాణ పాఠ్యాంశంలో చేర్చాలని ఉత్తమ్‌కుమార్ కోరారు. ఈ మేరకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, సీఎల్‌పీ నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీతో సంయుక్తంగా సీఎం కేసీఆర్‌కు సోమవారం లేఖ రాశారు.
     
    రైతాంగాన్ని పట్టించుకోరా..?


    రెండ్రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌కుమార్ విమర్శించారు. రెండున్నర లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయల తోటలు నష్టపోయాయని, గ్రామాల వారీగా పంట నష్టం వివరాలు తెప్పించుకుని, వెంటనే నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
     
    దూరమైన వర్గాలకు దగ్గరవుదాం..

    వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీకి దూరమైన వర్గాలను అనుకూలంగా మార్చుకునేలా చర్యలు తీసుకుంటామని  టీపీసీసీ ఉన్నతస్థాయి కమిటీ చైర్మన్ డి.శ్రీనివాస్ చెప్పారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణపై ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు. అయినా యువత, ఉద్యోగవర్గాలు కాంగ్రెస్‌కు దూరమయ్యాయన్నారు. వారిని తిరిగి దగ్గర చేర్చుకునేందుకు నిరంతరం శ్రమిస్తామన్నారు.
     
    స్వామిగౌడ్‌పై చర్యలు తీసుకోవాలి

    హిందువులంతా నలుగురేసి పిల్లలను కనాలంటూ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ వ్యాఖ్యానించడం విచారకరమని పీసీసీ అధికార ప్రతినిధులు మల్లు రవి, కొనగాల మహేశ్ పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ లౌకికవాదాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన స్వామిగౌడ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
     
    సోషల్ మీడియాపై కాంగ్రెస్ దృష్టి

     
    రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలకు సోషల్ మీడియాను వేదికగా చేసుకోవడంపై టీపీసీసీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం గాంధీభవన్‌లో ఐటీ రంగంతో సంబంధమున్న పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, సి.జె.శ్రీనివాస్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, అనిత, చరణ్ జోషి, రజనీష్‌గౌడ్, దీపక్‌జాన్‌తోపాటు ఐటీ రంగ సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యం, పార్టీ చేపట్టే కార్యక్రమాలు, భావజాలం వంటి వాటిని ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్స్‌అప్‌లలో విస్తృత ప్రచారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. దీనికోసం గాంధీభవన్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement