100 కాలేజీలకు అనుబంధ గుర్తింపు నిరాకరణ | Tomorrow TS Polycet Counseling | Sakshi
Sakshi News home page

100 కాలేజీలకు అనుబంధ గుర్తింపు నిరాకరణ

Published Mon, May 13 2019 1:57 AM | Last Updated on Mon, May 13 2019 10:34 AM

Tomorrow TS Polycet Counseling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ను ఈ నెల 14 నుంచి నిర్వహించేందుకు షెడ్యూల్‌ ప్రకటించిన సాంకేతిక విద్యా శిక్షణ మండలి రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు అనుబంధ గుర్తింపును జారీ చేయలేదు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన 162 కాలేజీల్లో రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ఇప్పటివరకు 62 కాలేజీలకే అనుబంధ గుర్తింపునిచ్చింది. ఒక్కో బ్రాంచీలో 60 సీట్లుంటే దానిని ఒక సెక్షన్‌గా పరిగణించి రూ.30 వేలు గుర్తింపు ఫీజు చెల్లించిన ఆయా కాలేజీలకు అనుబంధ గుర్తింపునిచ్చామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కొన్ని కాలేజీలు అదనపు సెక్షన్లు తెచ్చుకొని అదనపు ఫీజు చెల్లించడం లేదని, అలాంటి వాటికే అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని పేర్కొంటున్నారు.

యాజమాన్యాలు మాత్రం కాలేజీల్లోని ఒక్కో సీటుపై రూ.500 చొప్పున విద్యార్థులు మూడేళ్లు ఉంటారు కాబట్టి ముందుగానే మూడేళ్ల ఫీజు రూ.1,500 చెల్లించాలంటూ సాంకేతిక విద్యా మండలి నిబంధన విధించిందని చెబుతున్నాయి. ఇప్పటివరకు ఎక్కడా లేని ఈ నిబంధనను ఇప్పుడు ఎందుకు పెట్టారని కాలేజీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఏటా అనుబంధ గుర్తింపు ఇస్తున్నపుడు ఆ సమయంలో చెల్లిస్తామని పేర్కొంటున్నాయి. అధికారులు ఒక రకంగా, యాజమాన్యాలు మరో రకంగా చెబుతుండటంతో గందరగోళం నెలకొంది. మొత్తానికి 100 వరకు కాలేజీలకు సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ఇంతవరకు అనుబంధ గుర్తింపు జారీ చేయకపోవడంతో యాజమా న్యాలు సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విజ్ఞప్తి చేశాయి. ముందు అనుబం ధ గుర్తింపు ఇవ్వాలని కోరాయి. అయితే ఫీజు చెల్లిస్తేనే అనుబంధ గుర్తింపు ఇస్తామని సాంకేతిక విద్యా, శిక్షణ మండలి అధికారులు పేర్కొనడంతో కొన్ని యాజమాన్యాలు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధం అవుతున్నాయి.  

అదనపు సెక్షన్లకు ఫీజు చెల్లించకపోవడంతో..
అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గుర్తింపు కోసం రాష్ట్రంలోని 187 కాలేజీల్లోని 47,264 సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా 25 కాలేజీలు, 5,164 సీట్లకు కోత పెట్టింది. 162 కాలేజీల్లో 42,100 సీట్లకు గుర్తింపునిచ్చింది. దీంతో ఈ నెల 14 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రారంభించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అయితే అత్యధిక కాలేజీలు అదనపు సెక్షన్లకు అదనపు ఫీజు చెల్లించకపోవడంతో 100 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లభించలేదు. దీంతో కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నెల 14న రిజిస్ట్రేషన్లు, స్లాట్‌ బుకింగ్‌ ఉంది. ఈనెల 15 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్పటివరకు ఫీజు చెల్లించే కాలేజీలను కౌన్సెలింగ్‌లో అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

గతేడాదే అమలు చేశాం
బ్రాంచీల వారీగా, సెక్షన్ల వారీగా అనుబంధ గుర్తింపు ఫీజు చెల్లించాలన్నది పాత నిబంధనే. గతేడాది అమలు చేశాం. 60 మంది విద్యార్థులు ఉండే ఒక సెక్షన్‌కు రూ.30 వేల చొప్పున అనుబంధ గుర్తింపు ఫీజు నిర్ణయించాం. అదనపు సెక్షన్లకు కూడా రూ.30 వేల చొప్పున చెల్లించాలని గతేడాది చెప్పాం. కాలేజీలు ప్రారంభమయ్యాక అదనపు సెక్షన్ల ఫీజు చెల్లిస్తామని చెప్పడంతో ఊరుకున్నాం. కానీ చెల్లించలేదు. దీంతో ఈసారి ముందుగానే చెల్లించాలన్నాం. కొన్ని కాలేజీలు చెల్లించాయి. మరికొన్ని కాలేజీలు విద్యార్థిపై రూ.500 చొప్పున మూడేళ్లకు రూ.1500 అంటూ అపార్థం చేసుకుంటున్నాయి తప్ప మరేమీ లేదు.  
– వెంకటేశ్వర్లు, సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement