
‘గుట్ట’ అభివృద్ధికి అత్యున్నత సంస్థ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి అత్యున్నతస్థాయి పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
చైర్మన్‌గా సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి అత్యున్నతస్థాయి పర్యవేక్షణ సంస్థను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్, సభ్యులుగా మంత్రులు, నల్లగొండ జిల్లా లోక్‌సభ, శాసనసభ, శాసన మండలి సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వ్యవహరించనున్నారు. ఈ ప్రతిపాదనలకు కేసీఆర్ ఆమోదం తెలపగానే రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.
ఆలయాభివృద్ధి కోసం ఈ కమిటీ క్రమం తప్పకుండా సమావేశమై శీఘ్రంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పనులను నేరుగా పర్యవేక్షించనుంది. ఆలయాభివృద్ధి సంస్థ పరిధిని ఆలయం చుట్టూ ఉన్న 8 గ్రామాల్లోని సుమారు 28 వేల ఎకరాల వరకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. వీటిని సీఎం ఆమోదిస్తే, యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి, గిండ్లపల్లి, సైదాపూర్, దాతార్‌పల్లితో పాటు భువనగిరి మండలం రాయిగిరి తదితర గ్రామాల నుంచి ఈ భూమిని సేకరించనున్నారు.