‘నిమ్మ’ రైతు కళ్లల్లో చెమ్మ!
‘నిమ్మ’ రైతు కళ్లల్లో చెమ్మ!
Published Tue, Jul 11 2017 3:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
- పూర్తిగా పడిపోయిన ధరలు
- గతేడాది ఇదే సీజన్‌లో బస్తా రూ.800.. ప్రస్తుతం కేవలం రూ.80
సాక్షి, నల్లగొండ: నిమ్మ పంటకు ధర లేక ఈ పంట సాగు చేసిన రైతుల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. గతేడాది ఇదే సీజన్‌లో బస్తా రూ.800 పలికితే ఇప్పుడు అందులో 10% ధర రూ.80 పలుకుతోంది. ధర లేక పంటకోసి మార్కెట్‌కు తరలిస్తే ఎక్కువ ఖర్చు వస్తున్నదని, చెట్లమీద ఉన్న కాయలను తెంపి పారబోస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిమ్మ రైతులు ధరలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సోమవారం కలెక్టరేట్ వద్ద నిమ్మతోపాటు దొండకాయలను పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. నకిరేకల్ సమీపంలో ఇటీవల నిమ్మ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితేనే గిట్టుబాటు ధర దక్కేఅవకాశం ఉంది.
దిగుబడి వచ్చినా.. ధర దరువు
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 40 వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఈసారి దిగుబడి ఎక్కువ రావడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ ధర లేకపోవడంతో దిగుబడి ఎక్కు వ వచ్చిందన్న ఆనందం వారిలో ఆవిరైంది.
వ్యాపారుల సిండి‘కేటు’ మాయాజాలం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నకిరేకల్‌లో నియోజకవర్గం పరిధిలో నిమ్మ పంట ఎక్కువగా సాగవుతోంది. చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు నిమ్మకాయలను అమ్మకానికి ఇక్కడికే తెస్తారు. నిమ్మ వ్యాపారం పూర్తిగా ఇక్కడి వ్యాపారులు సిండి‘కేటు’గా మారి లావాదేవీలు సాగిస్తున్నారు. ఒక్కో నిమ్మకాయ బస్తా 22 కేజీలు ఉంటుంది. ఒక్కో బస్తాలో లావు కాయ 600 వరకు, చిన్న కాయలైతే 900 వరకు నింపుతారు. మరోవైపు నూటికి రూ.13 చొప్పు న కమీషన్ తీసుకుని రైతుల చేతికి డబ్బులు అందిస్తున్నారు. దీంతో బస్తా అమ్మినా కూలికి ఇచ్చే డబ్బులు కూడా రాకపోవడంతో కాయలు తెంపకుండా చెట్లమీదనే వదిలేస్తున్నారు
మార్కెట్ లేక తప్పని వెతలు..
రాష్ట్రంలోనే నిమ్మ సాగు ఎక్కువగా అయ్యేది నల్లగొండ జిల్లా అయినా.. ఇక్కడ రైతులు పంటను అమ్ముకోవడానికి మార్కెట్ లేదు. రైతుల వద్ద ఇక్కడ కొనుగోలు చేసిన నిమ్మను వ్యాపారులు హైదరాబాద్, ఖమ్మం, రాజ మండ్రి, విజయవాడ ప్రాంతాలకు తరలిస్తారు. అయితే వ్యాపారుల సిండికేట్‌తో ధర లేదని భావించే రైతులు మాత్రం ప్రధాన నగరాలకు వెళ్లి అమ్ముదామనుకుంటున్నా అక్కడ కూడా ధర లేకపోతే అసలు రవాణా ఖర్చులు కూడా రావని భావిస్తున్నారు. ఈ పరిస్థితితో చేసేదేమీ లేక వ్యాపారులు అడిగిన ధరకు రైతులు నిమ్మను అమ్ముకుంటున్నారు. నిమ్మ రైతుల వెతలను చూసి రాష్ట్రంలోనే నకిరేకల్‌కు తొలి నిమ్మ మార్కెట్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. మార్కెట్ నిర్మాణానికి రూ.3.7 కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం నిమ్మ మార్కెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నకిరేకల్‌లోని చీమలగడ్డలో నిమ్మ మార్కెట్ నిర్మాణం సాధ్యమైనంత త్వరలో పనులు పూర్తి చెయిస్తానని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.
రోడ్డెక్కిన రైతులు
నల్లగొండ టూ టౌన్: పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. నిమ్మకాయలు, దొండకాయలు తెచ్చి కలెక్టరేట్ ఎదుట పారబోసి నిరసన తెలిపారు. మద్దతు ధర కల్పించకపోవడంతో కనీసం కూలీల ఖర్చులు కూడా రావడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పండ్ల తోటల రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులంతా కలెక్టరేట్ ఎదుట ప్రధాన రహదారిపై భారీగా నిమ్మకాయలు, దొండకాయలు పోసి ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
Advertisement
Advertisement