
సాక్షి, హైదరాబాద్: కరోనాపై పోరాటాన్ని కాంగ్రెస్ పా ర్టీ సామాజిక బాధ్యతగా తీసుకుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. బాధ్యత గల ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తూనే తమ వంతుగా పేదలకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ నేత అనిరుధ్ రెడ్డి నేతృత్వంలో ఆ నియోజకవర్గ ప్రజలకు 1.50 లక్షల శానిటైజర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన సోమవారం గాంధీభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ వేళ పేదలను ఆదుకునే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కార్యకర్తలకు సూచించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని, దీనికి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల, బ్లాక్, గ్రామ కాంగ్రెస్ నేతలు తమ ప్రాంతాల పరిధిలో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి కరోనాపై ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరారు.