కాకతీయకు ‘మెషినరీ’ దెబ్బ! | tractors and proclains less in mission kakatiya project | Sakshi
Sakshi News home page

కాకతీయకు ‘మెషినరీ’ దెబ్బ!

Published Sat, May 14 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

కాకతీయకు ‘మెషినరీ’ దెబ్బ!

కాకతీయకు ‘మెషినరీ’ దెబ్బ!

చెరువుల పూడికతీత పనులకు దొరకని ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు
కావాల్సిన ప్రొక్లెయిన్లు 10 వేలు.. అందుబాటులో ఉన్నవి 6 వేలే..
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెప్పిస్తున్నా చాలని వైనం
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పనులకు ఆటంకం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ను మెషినరీ కొరత వేధిస్తోంది. చెరువుల పూడికతీతకు అవసరమయ్యే ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, కాంక్రీట్ మిక్సర్ల కొరత మిషన్ పనులకు అడ్డంకిగా మారింది. రాష్ట్రంలో ఉన్నవి కాక.. పక్క రాష్ట్రాల నుంచి ప్రొక్లెయిన్లు తెప్పిస్తున్నా సరిపోవడం లేదు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, రోడ్లు, భవనాల నిర్మాణ కార్యక్రమాలు చురుగ్గా సాగుతుండటం, ప్రధాన కాంట్రాక్టర్లంతా మెషినరీని ఆ పనులకు తరలిస్తుండటంతో చెరువు పనులకు యంత్రాలు దొరకడం లేదు. దీంతో ఒక చెరువు పరిధిలో రోజుకు 300 నుంచి 400 క్యూబిక్ మీటర్ల పూడికను తీయాల్సిం ఉండగా.. ప్రస్తుతం అది 100 క్యూబిక్ మీటర్లను కూడా దాటడం లేదు.

రాష్ట్రంలో రెండో విడత మిషన్ కాకతీయ కింద 9,035 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా, అందులో 8,862 చెరువులకు టెండర్లు పిలిచారు. ఇందులో 7,746 చెరువు పనులకు ఒప్పందాలు కుదరగా, 7,108 చెరువుల్లో పనులు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం పూడికతీత పనులు చేసేందుకు గరిష్టంగా మరో నెల గడువే ఉన్నా, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పనుల్లో వేగం కనిపించడం లేదు. ఇతర కారణాలు ఎలా ఉన్నా.. మెషినరీ కొరత మాత్రం పనులకు బంధనమేస్తోంది.

 ఉన్నవి ఆరు వేలే...
రాష్ట్రంలో చెరువుల పనులకు 10 వేల ప్రొక్లెయిన్లు అవసరం కాగా.. ప్రస్తుతం 6 వేలు మాత్రమే ఉన్నాయి. ట్రాక్టర్ల అవసరం 15 వేల వరకు ఉండగా, అవి 10 వేల మేర ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ దృష్ట్యా పనుల కోసం ఖమ్మం, నల్లగొండ జిల్లా కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి, మహబూబ్‌నగర్ కాంట్రాక్టర్లు రాయలసీమ, కర్ణాటక నుంచి, ఆదిలాబాద్ జిల్లా కాంట్రాక్టర్లు మహారాష్ట్ర నుంచి మెషినరీ తెప్పిస్తున్నారు. దీంతో ఈ జిల్లాల్లో పనుల్లో కొంత మెరుగుదల కనబడుతోంది.

మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం మెషినరీ సమస్య తీవ్రంగా ఉంది. దీంతో వరంగల్ జిల్లాలో 1,081 చెరువులకు గానూ 649, కరీంనగర్‌లో 1,054 చెరువులకు 753, నిజామాబాద్‌లో 649కి 547, మెదక్‌లో 1,679కి 1,512 చెరువుల్లో మాత్రమే పనులు ఆరంభమయ్యాయి. దీనికితోడు రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుండటంతో ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్లు ఆ పనులకు తరలివెళుతున్నాయి. వీటితో పాటే గ్రామీణ రోడ్లు, రెండు పడకల ఇళ్ల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు మొదలుకావడంతో ప్రొక్లెయిన్లు, ట్రాక్టర్లు, కాంక్రీట్ మిక్సర్లు, సెల్ఫ్ లోడర్స్ అన్నీ ఆ పనులకే వెళుతున్నాయి.

తగ్గిన పూడికతీత సామర్థ్యం
గత ఏడాది ఒక్కో చెరువు కింద 3 నుంచి 4 ప్రొక్లెయిన్లు.. 30 నుంచి 40 ట్రాక్టర్లు పనిచేసేవి. దీంతో ప్రతి రోజూ సుమారు 300 క్యూబిక్ మీటర్ల పూడికను తీసే వీలు కలిగింది. ప్రస్తుతం ఒక్కో చెరువు పరిధిలో ఒక ప్రొక్లెయిన్, 10కి మించని ట్రాక్టర్లు ఉండటంతో రోజూ 100 క్యూబిక్ మీటర్ల పూడికతీత కూడా సాధ్యం కావడం లేదు. ఈ సమస్య కారణంగా వర్షాలు మొదలయ్యే నాటికి అనుకున్న మేర పూడికతీత సాధ్యమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement