వరంగల్: ఇంట్లో ఉన్న వ్యాపారిని ఎవరో పిలుస్తున్నారని చెప్పి..బయటకు వచ్చాక కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. పట్టణానికి చెందిన వెంశెట్టి సోమయ్య(56) ఎరువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు సంతానం అమెరికాలో స్థిరపడటంతో ఇంటి వద్ద భార్య భర్తలు మాత్రమే ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కొందరు వ్యక్తులు వచ్చి ఇంట్లో ఉన్న సోమయ్యను బయటకు పిలిచి వ్యానులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బయటకు వెళ్లిన భర్త ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గతంలో వెంశెట్టి సోమయ్య, వెంశెట్టి కృష్ణ ల మధ్య కోల్డ్‌స్టోరేజ్‌కు సంబంధించిన గొడవలు ఉండటంతో.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.