
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలోని సత్యం థియేటర్ మార్గంలో జీహెచ్‌ఎంసీ అధికారులు నాలా వంతెన నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో గురువారం నుంచి మూడు నెలల పాటు కనకదుర్గ దేవాలయం–సత్యం థియేటర్ మధ్య మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సంయుక్త పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) డాక్టర్ వి. రవీందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి కేవలం ఆర్టీసీ బస్సులు, భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.
మైత్రీవనం నుంచి గ్రీన్‌ల్యాండ్స్ వైపు వెళ్ళే ఈ వాహనాలను ధరమ్‌కరమ్ రోడ్, జీహెచ్‌ఎంసీ ప్లేగ్రౌండ్, సోనబాయ్ టెంపుల్, సత్యం థియేటర్ మీదుగా పంపించనున్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలను అనుమతిస్తామని చెప్పారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో ఉంచుకుని తమకు సహకరించాలని కోరారు.
మలక్‌పేటలోనూ..
మలక్‌పేట ఆర్వోబి వద్ద మెట్రో వయాడక్ట్‌ల(సెగ్మెంట్‌ల) అనుసంధాన ప్రక్రియ పూర్తయింది. వయాడక్ట్‌ల అనుసంధానం కోసం నాలుగు నెలల క్రితం ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీక్రేన్ సహాయంతో ఎల్‌జి బ్రిడ్జి బ్లిల్డర్‌ను పిల్లర్లపైకి ఎక్కించారు. మూడు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి సెగ్మెంట్‌లను అనుసంధానం పూర్తిచేశారు. వయాడక్ట్‌ల అనుసంధానం పూర్తయి నెల రోజులు గడుస్తున్నా బ్రిడ్జి బిల్డర్‌ను కిందకి దింపలేకపోవటం, మరోవైపు మెట్రో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మలక్‌పేటలో ట్రాఫిక్ ఆంక్షలు విధించాలని డాక్టర్ వి. రవీందర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంగళవారం నుంచి నవంబర్ 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.