సాక్షి, సిటీబ్యూరో: సిటీలో అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్‌సుఖ్‌నగర్–చాదర్‌ఘాట్ రహదారి ప్రధానమైనది. ఈ రూట్‌లో మలక్‌పేట రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులకు కారణంగా మారుతోంది. రద్దీ వేలల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఈ ప్రాంతంలో అండర్ పాస్ ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో సహా ప్రీ–పెయిడ్ బూత్‌లకు సంబంధించిన ప్రతిపాదనలను రైల్వే అధికారులకు పంపించారు. ఇది నత్తనడకన నడుస్తోంది. ఇప్పటికీ వీటికి మోక్షం లభించలేదు. మరోపక్క మూసీ వెంట మరో మార్గాన్ని అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన ప్రతిపానలు జీహెచ్‌ఎంసీ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనచోదకులకు నిత్యం నరకం తప్పట్లేదు.
అత్యంత కీలకం
దిల్‌సుఖ్‌నగర్–చాదర్‌ఘాట్ రూట్‌లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలు నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్‌లో తిరిగే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఈ కారణంగా రద్దీ వేళల్లో అటు చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు... ఇటు నల్లగొండ చౌరస్తా వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ మార్గంలో వెళ్లాలంటేనే వాహన చోదకులు హడలిపోతున్నారు. మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు వంతెన అటు–ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్‌లో నరకం చవి చూడాల్సిందే.
ఆ రెండింటి స్ఫూర్తితో ప్రతిపాదనలు...
ఇలాంటి అనేక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ట్రాఫిక్ విభాగం అధికారులు నగర వ్యాప్తంగా రైలు వంతెనలు, వాటి కింద నుంచి వెళ్లే రహదారుల్లో పరిస్థితుల్ని అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్ నిలయం, కాలాడేరా ప్రాంతంలో చేపట్టిన చర్యలను పరిగణలోకి తీసుకున్నారు. రైల్ నిలయం వంతెన కింద గతంలో రెండు మార్గాలే ఉండేవి. చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట, చంచల్‌గూడ వైపు వెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా ఉన్న కాలాడేరా ప్రాంతంలోనూ నాలా వద్ద ఉన్న రైల్ వంతెన ఒకటే ఉండేది. దీంతో ఆ రెండు చోట్లా భారీ ట్రాఫిక్ జామ్స్ తప్పేవి కాదు. ట్రాఫిక్ అధికారుల ప్రతిపాదనలు, రైల్వే విభాగం చొరవ తీసుకోవడంతో రైల్ నిలయం వద్ద మూడో మార్గం, కాలాడేరాలో రెండోది అందుబాటులోకి వచ్చాయి. ఇదే తరహాలో మలక్‌పేట రైల్ వంతెన వద్ద మూడో మార్గం ఏర్పాటు చేయించాలని అధికారులు 2016లో నిర్ణయించారు.
‘డైనమిక్’గా వాడుకోవచ్చునని...
ప్రస్తుతం మలక్‌పేట రైల్ వంతెన వద్ద ఉన్న రెండు మార్గాలను ఒకటి చాదర్‌ఘాట్ వైపు, మరోటి మలక్‌పేట్ వైపు వెళ్లే వాహనాల కోసం వినియోగిస్తున్నారు. మూడో మార్గం అందుబాటులోకి వస్తే దాంతో సహా అన్నింటినీ డైనమిక్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌గా పిలిచే రివర్సబుల్ లైన్ ట్రాఫిక్ మెథడ్‌లో వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీని ప్రకారం ఓ మార్గాన్ని పూర్తి స్థాయిలో వన్ వేగా మార్చకుండా... రద్దీని బట్టి ఆయా సమయాల్లో వన్‌వేగా చేస్తుంటారు. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు పీక్ అవర్స్‌లో వన్‌వేగా ఉన్న మార్గం ఆపై టూ వేగా మారిపోతుంది. తిరిగి సాయం త్రం పీక్ అవర్స్ ప్రారంభమైనప్పునప్పు ఉద యం నడిచిన దిశకు వ్యతిరేకంగా వన్‌వేగా మారు తుంది. తద్వారా రద్దీని తట్టుకోవడంతో పాటు ఒకే మార్గాన్ని వివిధ రకాలుగా వినియోగించుకు నే అవకాశం ఉంటుందని భావించారు. ఈ వన్‌వేలు, వాటి సమయాలపై పూర్తి స్థాయి ప్రచారం కల్పించడంతో ప్రతి వాహనచోదకుడికీ అవగాహ న కల్పిస్తే ఫలితాలుంటాయని అంచనా వేశారు.
మూసీ మార్గాన్ని అన్వేషించినా...
మలక్‌పేటలో మూడో అండర్ పాస్ ఏర్పాటుకు రూ.10 కోట్లు ఖర్చవుతాయని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మొత్తం చెల్లించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) సంస్థ ముందుకు వచ్చింది.ఈ ప్రతిపాదనలు నత్త నడకన సాగుతుండటంతో మూడేళ్లుగా పనులు ప్రారంభం కాలేదు. మరోపక్క మలక్‌పేట సమీపంలోని మూసీ నది వెంబడి మరో రహదారి అభివృద్ధి చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని ట్రాఫిక్ అధికారులు భావించారు. చాదర్‌ఘాట్ కాజ్‌వే దాటిన తర్వాత మూసీ వెంట ప్రస్తుతం ఓ మార్గం ఉంది. ఇది ఓల్డ్ మలక్‌పేట మీదుగా వెళ్తుంది. అయితే అనేక చోట్ల పూర్తిస్థాయిలో నిర్మాణం లేకపోవడంతో వాహనాల రాకపోకలకు అనువుగా లేదు. మరోపక్క ఈ రూట్‌ను అభివృద్ధి చేయాలంటే పలు ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న హైటెన్షన్ వైర్లకూ పరిష్కారం కనుక్కోవాల్సి ఉంటుంది.దీనిని వాహనచోదకులకు అందుబాటులోకి తీసుకువస్తే చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట వెళ్లాల్సిన అవసరం లేకుండా మూసరామ్‌బాగ్ సమీపంలోని అంబర్‌పేట్ కాజ్ వే వరకు ట్రాఫిక్‌ను మళ్లించవచ్చు. ఫలితంగా ఇరుకుగా ఉన్న మలక్‌పేట రహదారిపై రద్దీ తగ్గుతుంది. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు మూసీ రహదారి అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి బల్దియాకు పంపాలని భావించారు. వీటికీ మోక్షం కలగకపోవడంతో వాహనచోదకులకు నిత్య నరకం తప్పట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment