విద్యుత్ బోరుమోటర్ సర్‌చార్జీ కట్టలేదని మండలంలోని పెద్దలింగారెడ్డిపల్లిలో మంగళ, బుధవారాల్లో పొలాల వద్ద ఉన్న సుమారు 40 మంది రైతుల స్టార్టర్లను ట్రాన్స్‌కో సిబ్బంది ఎత్తుకెళ్లారు. మక్కలు, వరి ధాన్యాన్ని మార్కెట్‌లో విక్రయించామని, ఆ డబ్బు రాగానే బకాయిగా ఉన్న సర్‌చార్జీ చెల్లిస్తామని, రెండు రోజులు గడువు ఇవ్వాలని రైతులు కోరినా కరెంటోళ్లు కనికరం చూపలేదు.
దీంతో ఆగ్రహించిన పెద్దలింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతులు పలువురు రాఘవాపూర్ బస్‌స్టేజీ వద్ద రాస్తారోకోకు దిగారు. వీరికి బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు పలువురు మాట్లాడుతూ, బోరుమోటార్లపైనే ఆధారపడి సాగుచేసుకుంటున్న తమపై కక్ష కట్టడం దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సారు రైతుకు ఏ ఇబ్బందీ రానివ్వనని చెప్తుంటే, కరెంటోళ్లు మాత్రం కనికరం లేకుండా కనెక్షన్‌లు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం అమ్మిన 72 గంటల్లో డబ్బులు ఖాతాలో జమ చేస్తామని చెప్పిన అధికారులు, 15 రోజులైనా ఆ పని చేయడం లేదని, మేము మాత్రం సమయానికి కరెంటు బిల్లు కట్టలేదని స్టార్టర్లు తీసుకెళ్లడం ఎంత వరకు న్యాయమన్నారు.
వారికో న్యాయం, మాకో న్యాయమా అని ప్రశ్నించారు. ధాన్యం అమ్మినా డబ్బు చేతికందలేదని, రెండు రోజులు గడువు ఇస్తే బకాయి చెల్లిస్తామని చెప్పినా వినకుండా స్టార్టర్లను ఎత్తుకెళ్లారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ పరిస్థితుల్లో బోరుబావుల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతాయని వేడుకున్నా.. ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోలేదన్నారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్, ఏఎస్‌ఐ వెంకటయ్యలతో పాటు సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. బిల్లులు చెల్లించేందుకు గడువు అడిగినా స్టార్టర్లను లాక్కెళ్లిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్ రైతులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
టాన్స్‌కో జులుం..
Published Thu, Nov 27 2014 12:14 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM
Advertisement
Advertisement