బదిలీల భయం | transfers in police department in new government | Sakshi
Sakshi News home page

బదిలీల భయం

Published Thu, May 29 2014 12:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

transfers in police department in new government

ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : పోలీసుశాఖలో బదిలీలపై చర్చ సాగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న క్రమంలో బదిలీలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. మిగతా నియోజకవర్గాల్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కొలువుదీరారు. ఈ నేపథ్యంలో ఆయా పోలీసుస్టేషన్‌ల పరిధిలో సీఐ, ఎస్సైల పోస్టుల్లో తమకు అనుకూలమైన ఇన్‌స్పెక్టర్లను నియమించుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యా యి. పలువురు ఆశావహులు అనుకూల స్థానం కోసం ఆయా ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో బదిలీలపై ఆసక్తి నెలకొంది.

 అప్పుడే ప్రయత్నాలు..
 తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతున్న తరుణంలో జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు మొదటగా పోలీసు శాఖనే టార్గెట్ చేయనున్నారు. ఉద్యమ, మిగతా సమయాల్లో తమకు సహకరించని కొందరు పోలీసు అధికారులపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే వీరిని బదిలీ చేయించి తమకు అనుకూలమైన వారిని తెచ్చుకోవడానికి అప్పుడే కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తమకు సహకరించని అధికారులను సాగనంపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఆదిలాబాద్, చెన్నూరు, సిర్పూర్, మంచిర్యాల ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఇంతకుముందు టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహించారు. అయితే పదవిలో ఉన్నప్పటికి అధికార కాంగ్రెస్ పార్టీదే వేదంగా ఇక్కడ అధికారులు వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇందులో నుంచి సిర్పూర్ నియోజకవర్గం మినహా ఆదిలాబాద్, మంచిర్యాల, చెన్నూరులతోపాటు కొత్తగా బోథ్, బెల్లంపల్లి, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నాయకులే గెలుపొందారు.

 కాంగ్రెస్ అండదండలతో..
 రాష్ట్రంలో మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు చెప్పిందే వేదంగా జిల్లాలో నడిచింది.పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ నేతల ఆశిస్సులు పొందినవారే వచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల కంటే, అధికార పార్టీ నేతలదే హ వా కొనసాగింది. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన వారు నామమాత్రంగానే అధికారాన్ని ఉపయోగించుకున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుండటంతో నాయకులు మొదట సహకరించని, తమకు అనుకూలమైన నాయకులపై దృష్టిసారించారు. జిల్లాలో పనిచేస్తున్న సీఐలు, ఎస్సైల విషయంలో ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 మొదలైన పైరవీలు
 జిల్లాలో ఇప్పటికే సీఐలు, ఎస్సైలు తమకు అనుకూలమైన స్థానంలో పోస్టింగ్ కోసం పైరవీలు షూరూ చేసినట్లు సమాచారం. జిల్లాలో బదిలీలు జరిగినప్పుడు తమకు అవకాశం ఇప్పించమని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కొందరు పోలీసు అధికారులు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అధికారం చేపట్టబోతున్న టీఆర్‌ఎస్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా సీఐ పోస్టింగ్ విషయంలో గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన వారు, కొత్త వారు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం మారడంతో తమకు బదిలీలు తప్పవనే భావనతో ఉన్న కొందరు అధికారులు ప్రస్తుత అధికార పార్టీల నేతలను మచ్చిక చేసుకునే యోచనలో ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement