పోటెత్తిన గిరిజనం | Tribals protests to opposite of caved ordinance | Sakshi
Sakshi News home page

పోటెత్తిన గిరిజనం

Published Tue, Jul 8 2014 2:01 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

Tribals protests to opposite of caved ordinance

భద్రాచలం:  పోలవరం ఆర్డినెన్స్‌కు నిరసనగా భద్రాచలంలో సోమవారం ఆదివాసీలు కదం తొక్కారు. జాతి మనుగడ కోసం ఎంతటి పోరాటాలకైనా సిద్ధమేనని విల్లంబులు ఎక్కుపెట్టారు. ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ, అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భద్రాచలంలో నిర్వహించిన ‘ఆదివాసీల ఆత్మగౌరవ సభ’కు  భారీ సంఖ్యలో గిరిజనులు తరలివచ్చారు. ముందుగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు.

గిరిజన సంప్రదాయ నృత్యాలు, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు , కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకులు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..  ఆదివాసీల అభిప్రాయాలు తెలుసుకోకుండానే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపాలని నిర్ణయించడం దారుణమని విమర్శించారు. ప్రాణాలర్పించైనా సరే.. పోలవరం ఆర్డినెన్స్‌ను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

ముంపు మండలాల పరిరక్షణ కోసం చింతూరు నుంచి భద్రాచలం బ్రిడ్జి వరకు దిగ్బంధనం చేయాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ ఎంపీలు దీనిపై పోరాడుతున్నారని, మిగతా పార్టీల ఎంపీలు సైతం ముంపు బాధితులకు బాసటగా నిలవాలని కోరారు.  దీనిపై న్యాయపోరాట ం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్ పేరుతో ముంపు మండలాలను స్వాధీనం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్సుత్సాహం చూపుతోందని, దీనిలో భాగంగానే మద్యం దుకాణాలను అప్పుడే ఆక్రమించిందని విమర్శించారు.

 భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గిరిజన చట్టాలను తుంగలో  తొక్కి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. ఆదివాసీలు మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. టీడీపీ, బీజేపీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఆ పార్టీలు కళ్లు లేని కబోదుల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్రల కారణంగానే ఆర్డినెన్స్ వచ్చిందన్నారు.

ఈనెల 14న ఆదివాసీ సంఘాలు, రాజకీయ పార్టీల సమక్షంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీల ఆత్మగౌరవం కోసం విల్లంబులను ఎక్కుపెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వేలాది మంది ఆదివాసీలు తరలివచ్చిన ఈ సభ నరేంద్రమోడీ ప్రభుత్వానికి హెచ్చరిక అవుతుందన్నారు. ముంపు మండలాల కోసం ఆదివాసీలు చేసే ఈ నిరసనలే ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని హితవు పలికారు.  ముంపు ఆర్డినెన్స్ రద్దు కోసం చేసే ఉద్యమాల్లో కలిసి వచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.

 ఇంకా ఈ సభలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య,  పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వట్టం నారాయణ, కో కన్వీనర్ ముర్ల రమేష్, సీపీఐ డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర నాయకులు బండారు రవికుమార్, ఎన్‌డీ రాష్ట్ర నాయకులు కెచ్చెల రంగారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు తిప్పన సిద్దులు మాట్లాడారు.

పోలవరం వ్యతిరేక పోరాట కమిటీ కో కన్వీనర్ గుండు శరత్ అధ్యక్షతన జరిగిన సభలో అడ్వకేట్ జేఏసీ నాయకులు తిరుమలరావు, ఆదివాసీ నాయకులు సోందె వీరయ్య, టీజేఏసీ నాయకులు పూసం రవికుమారి, పొడియం నరేందర్, తాళ్ల రవికుమార్, సీపీఎం నాయకులు అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, యలమంచి రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, బ్రహ్మచారి, ఎంబి నర్సారెడ్డి, అన్నెం సత్యాలు, సీపీఐ నాయకులు టి. వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ నాయకులు కెచ్చెల కల్పన, షేక్ గౌస్, వెంకటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు ఏవీ రావు, తుడుందెబ్బ నాయకులు వాసం రామకృష్ణ, టీజేఏసీ నాయకులు కూరపాటి రంగరాజు, చల్లగుళ్ల నాగేశ్వరరావు, వెక్కిరాల శ్రీనివాస్, ఎస్‌కే గౌసుద్దీన్, సోమశేఖర్, బాలకృష్ణ, టీఫీటీఎఫ్ నేత ఎం. రామాచారి, టీఎస్‌యూటీఎఫ్ నాయకులు వెంకటేశ్వరరావు, బి రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement