పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనే అంశంపై టీఆర్‌ఎస్‌లో ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఈటెల రాజేందర్, బి.వినోద్‌కుమార్ తదితరులు సోమవారం కూడా సమావేశమయ్యారు.
సాక్షి, హైదరాబాద్: పొత్తులు ఎవరితో పెట్టుకోవాలనే అంశంపై టీఆర్‌ఎస్‌లో ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు ఈటెల రాజేందర్, బి.వినోద్‌కుమార్ తదితరులు సోమవారం కూడా సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌తో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, చర్చించడానికి ఢిల్లీ వస్తున్నారని కాంగ్రెస్ ప్రకటించినా టీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లలేదు. అయితే పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ సీపీఐ జాతీయస్థాయి నాయకత్వం చేసిన ప్రకటనపై ఈ సమావేశంలో చర్చించారు.
కాంగ్రెస్ పార్టీతో అనుసరించాల్సిన వైఖరిపైనా చర్చించారు. అయితే సీట్ల సంఖ్యలో కచ్చితమైన అంగీకారం కుదరకుంటే కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదనే నిర్ణయంతో కేసీఆర్ ఉన్నట్టుగా పొత్తుల చర్చల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకుడు ఒకరు వెల్లడించారు. వీటిపై అంతర్గతంగా ఒక స్పష్టత వచ్చిన తర్వాతనే చర్చలను బహిరంగపర్చాలని అనుకుంటున్నారు. రెండు, మూడు రోజుల తర్వాతనే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆ నేత తెలిపారు. అయితే మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు.