సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : తాటికొండ రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించిన అంశం జిల్లా అధికార పార్టీలో హాట్‌టాపిక్‌గా మారింది. రాజయ్య వ్యవహారంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొద్దినెలలుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ ఉన్నఫళంగా మంత్రి పదవి నుంచి తొలగిస్తారని నేతలెవరూ ఊహించలేదు. చాలా మంది నేతలకు ఇది మింగుడు పడని అంశమే అయినా కేసీఆర్ జెట్‌స్పీడ్‌తో నిర్ణయాలు తీసుకుంటారని ఎవరూ భావించలేదు. రాష్ర్ట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుకు సన్నిహితుడిగా ముద్రపడిన రాజయ్యను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం ప్రధానంగా హరీష్ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజయ్యను మంత్రి పదవిలో కొనసాగించేందుకు హరీష్ రావు చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన హరీష్‌రావు వెన్నంటి జిల్లాలో పెద్ద ఎత్తున నాయకులున్నారు.
హరీష్ ఉండగా తమకు ఢోకాలేదని భావించిన నేతలంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికే ఈ పరిస్థితి వచ్చిందంటే తమ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన వారిలో మొదలైంది. దీంతోపాటు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ రాజయ్య సొంత జిల్లా వరంగల్‌లో పర్యటించి వచ్చిన 24 గంటల్లోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పార్టీలో, ప్రభుత్వంలో అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదనే సంకేతాలను పంపేందుకే కేసీఆర్ రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించారని కొందరు నేతలు వ్యాఖ్యానిస్తుండగా, ఈ పరిణామం ఎక్కడి వరకు దారితీస్తుందనే ఆందోళనను మరికొందరు వ్యక్తం చేస్తున్నారు.
ఈటెల, కేటీఆర్‌లకు బేఫికర్!
మంత్రుల విషయానికొస్తే ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు జిల్లాలో నిజాయతీపరుడనే పేరుండటం, అందుకు తగినట్లుగానే నిరంతరం సభలు, సమీక్షల్లో అవినీతి అంశాన్ని, కేసీఆర్ ఆలోచనలను ప్రస్తావిస్తున్నారు. ‘ప్రజల సొమ్ముకు జవాబుదారీలేకుండా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరించినా, ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా చర్యలు జైలుకు పంపుతాం’ అనే సంకేతాలను ఇటు అధికారులకు, అటు నాయకులకు పంపుతున్నారు. ఇక కేటీఆర్ విషయానికొస్తే ‘అయితే తన నియోజకవర్గం... లేదంటే హైదరాబాద్‌కే పరిమితమవుతున్నారే తప్ప జిల్లా రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ముఖ్యమైన పని ఉంటే తప్ప ఆయన జిల్లా కేంద్రానికి కూడా రావడం లేదు. ఇద్దరు మంత్రుల పనితీరు విషయంలో ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు ఎలాంటి అసంతృప్తి లేదు. పైగా ఇటీవలి కాలంలో ప్రభుత్వ, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాల్లో వీరిద్దరిని కూడా భాగస్వాములను చేస్తున్నట్లు తెలుస్తోంది.
మా పరిస్థితి ఏంది?
జిల్లా ప్రజాప్రతినిధుల విషయానికొస్తే కొందరిపై కేసీఆర్ నజర్ పెట్టినట్లు సమాచారం. నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ అవినీతికి అలవాటుపడిన ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే జైలుకు పంపేందుకూ వెనుకాడననే సంకేతాలను పంపారు. జిల్లాలో ప్రస్తుతం కొందరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. పోలీసులు, అధికారుల బదిలీల్లో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలొచ్చిన ఎమ్మెల్యేలను పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది. పాలనాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే అధికారుల బదిలీల విషయంలో ఎమ్మెల్యేల సిఫారసులకు పెద్దపీట వేస్తే, కొందరు నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని డబ్బులు తీసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది.
‘తెలంగాణ వస్తే బాగుపడతామనే భావనతోనే ప్రజలు మనకు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక మీ బాగోగులే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు. మీరే అవినీతికి పాల్పడితే అధికారులపై ఇక అజమాయిషీ ఎట్లా ఉంటుంది. తీరు మార్చుకోకపోతే జైలుకు పంపేందుకూ వెనుకాడను’ అని హెచ్చరించారనే ప్రచారమూ జరిగింది. కేసీఆర్‌తో భేటీ అనంతరం సదరు ఎమ్మెల్యేల్లో మార్పు కన్పిస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో జిల్లాలో భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు, ఇసుక, కలప దందాలు ఎక్కువయ్యాయని దీనివెనుక కొందరు ఎమ్మెల్యేలున్నారనే చర్చ అధికార పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కూడా సీఎం దృష్టికి వెళ్లడంతో దందాలను ప్రోత్సహిస్తున్న సదరు ఎమ్మెల్యేల్లో తాజాగా రాజయ్య ఎపిసోడ్‌తో టెన్షన్ మొదలైంది.
జాగ్రత్తగా ఉండకపోతే తమకూ ఇబ్బందులు తప్పవేమోననే భావనతో ఉన్నారు. అక్రమ దందాలకు అలవాటుపడిన సదరు ఎమ్మెల్యేల వర్గీయులు మాత్రం తాము చేస్తున్న పనులను సమర్థించుకోవడం గమనార్హం. ‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేం ఎన్నో కష్టాలు పడ్డాం. పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినం. ఇన్నాళ్లకు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో కొన్ని డబ్బులు వెనుకేసుకునే పనులు చేస్తే తప్పేముంది?’ అని ప్రశ్నిస్తున్నారు. మొత్తమ్మీద మంత్రివర్గం నుంచి రాజయ్య బర్తరఫ్ ఎపిసోడ్ జిల్లా అధికార పార్టీ నేతల్లో ప్రధాన చర్చనీయాంశం కావడం గమనార్హం.