ప్రగతినగర్ : బీడీ కార్మికుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ప్రగతిబీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట అధ్యక్షుడు వనమాల కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేను ఒక్క రోజులో చేపట్టిన కేసీఆర్‌కు ఏడు లక్షల మంది బీడీ కార్మికుల లెక్క కష్టంగా మారిందా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తలుచుకుంటే నాలుగు గంటల్లో బీడీ కార్మికుల జీవన భృతి లెక్క తేలిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో బీడీ కార్మికులకు నెలకు జీవన భృతి కింద నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ప్రగతిబీడీ వర్కర్స్‌యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాలను వేలాది మంది బీడీ కార్మికులు ముట్టడించారు.
అంతకు ముందు స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుస్తు బందోబస్తులో భాగంగా పోలీసులు తహశీల్ కార్యాలయం గేటును మూసి ఉంచారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వనమాల కృష్ట మాట్లాడుతూ.. తాము కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలేదన్నారు. తెలంగాణలో సుమారు ఏడు లక్షల మంది బీడీ కార్మికులు ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన హామీకి కట్టుబడి టీఆర్‌ఎస్‌కు అధికారాన్ని కట్టబెట్టారన్నారు. కానీ ప్రస్తుతం టీఆర్‌ఎస్ సర్కార్ బీడీ కార్మికుల గురించి పట్టించుకోవడమే మానేసిందన్నారు. కనీసం వారి గురించి మాట్లాడడం కూడా లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. బీడీ కార్మికులకు యాజమాన్యాలు నెలకు పది లేదా పన్నెండు రోజులు మాత్రమే పని కల్పిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
దీంతో బీడీ కార్మికులకు నెలకు కనీసం వెయ్యి రూపాయలు కూడా దాటడం లేదన్నారు. కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున కూడా బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అనంతరం జరిగిన కేబినేట్‌లో కూడా భృతిపై ఆమోదం కూడా జరిగిందన్నారు. బీడీ కార్మికులకు ఇచ్చిన హామీని మరచిపోవడం బాధాకరమన్నారు. జిల్లా ఆడబిడ్డ ఎంపీ కవిత కూడా ఈ విషయంలో బీడీ కార్మికులకు హామీ ఇచ్చారని, ఆమె కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎన్.దాసు, వెంకటి,సాయాగౌడ్,రాజేశ్వర్,కిషణ్,లింగం,సత్తెక్క,పీడీఎస్‌యూ,పీవైఎల్ నాయకులు సుధాకర్, మారుతి రాజు,గంగాధర్,సుజిత్,ప్రశాంత్‌తోపాటు జిల్లాలోని అన్ని మండలాల బీడీ కార్మికులు పాల్గొన్నారు.
సీఎం సారూ..వింటారా మా గోడు
Published Thu, Dec 11 2014 3:58 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement
Advertisement