కరీంనగర్ సిటీ : టీఆర్‌ఎస్ సీనియర్ నేత, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టడం పట్ల కొప్పుల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్‌లో జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరైన ఆయన సమావేశం మధ్యలోంచే ఇంటికి వెళ్లిపోయి పొద్దుపోయే వరకూ బయటకు రాలేదు. మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఆయన నివాసానికి వచ్చి సంఘీభావం తెలిపారు. కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చి చీఫ్ విప్‌తో సరిపెట్టడమేంటని సన్నిహితులతో కొప్పుల వాపోయినట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవి చేపట్టలేనని చెప్పినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడు సంతోష్‌కు ఇదే విషయాన్ని తెలి యజేస్తూ ఓ సంక్షిప్త సందేశాన్ని పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ‘ముఖ్యమంత్రిగారు నాకు చీఫ్ విప్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవిలో కొనసాగలేను. ఎమ్మెల్యేగానే ఉంటా. పార్టీ కార్యకర్తగానే కొనసాగుతా’ అనేది ఆ సందేశ సారాంశం. ఆదివా రం ఉదయమే సందేశం పంపించినప్పటికీ రాత్రి పొద్దుపోయేవరకు అధిష్టానం నుంచి స్పం దన రాకపోవడంతో కొప్పుల తీవ్ర ఆవేదనకు లోనైనట్లు తెలిసింది. ‘మంత్రి పదవి ఇవ్వకపో తే ఇవ్వకపాయే... కనీసం పిలిచి మాట్లాడితే... భారం తగ్గేదికదా’ అంటూ ఆయన అనుచరుడొకరు ‘సాక్షి’తో ఆక్రోశం వెళ్లగక్కారు. అయినప్పటికీ చీఫ్‌విప్ పదవి తీసుకోక తప్పదేమో ననే భావనతో కొప్పుల ఉన్నట్లు సమాచారం.
మీడియాకు దూరంగా...
ఆదివారం రోజంతా టీవీ చానెళ్లలో వస్తున్న కథనాలు, మాల మహానాడు కార్యకర్తల ఆందోళన లు సైతం కొప్పులను ఆందోళనకు గురిచేసినట్లు తెలుస్తోంది. వీటివల్ల కేసీఆర్‌కు తప్పుడు సంకేతాలు వెళతాయనే భావనలో ఆయన ఉన్నారు. పదవిపై కొప్పుల తీవ్ర అసంతృప్తితో ఉన్నప్పటికీ బయటకు వెలిబుచ్చే పరిస్థితి కని పించడం లేదు. ఉన్న ఫళంగా కేసీఆర్ నిర్ణయా న్ని వ్యతిరేకించే ధైర్యం చేయకపోవచ్చని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మీడియా ప్రతినిధులంతా కొప్పులతో మాట్లాడించాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చీఫ్ విప్ పదవిని యాక్సెప్ట్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ‘యాక్సెప్ట్ చేయలేదు... కొనసాగించలేదు’ అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చారు. వెంటనే ‘దయచేసి నన్ను మాట్లాడాలని ఇబ్బంది పెట్టొ ద్దు... ప్లీజ్’ అంటూ మీడియాను వేడుకున్నారు.
రాజధానికి పయనం
కేసీఆర్‌నుంచి పిలుపు వస్తుందని భావించినా రాకపోయేసరికి లాభం లేదని కొప్పుల ఆదివా రం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ‘సారు మాట కాదనటోళ్లం కాదు... కానీ, ఏం చేయాలో అర్థమైతలేదు’ అని తన సన్నిహితులతో వాపోయినట్లు తెలిసింది. అవకాశమొస్తే కేసీఆర్‌ను కలిసి భవిష్యత్‌పై ఏదైనా హామీ తీసుకుని చీఫ్ విప్ బాధ్యతలు చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
దగ్గరున్నా... దూర దూరంగానే...
మరోవైపు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీలు వినోద్‌కుమార్, బాల్కసుమన్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తదితరులు కరీంనగర్ పట్టణంలోనే ఉన్నప్పటికీ కొప్పుల నివాసానికి వెళ్లలేదు. వీరిలో ఎంపీలు, కొందరు నేతలు కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో కొప్పులను కలిసినప్పటికీ అక్కడ ఈ అంశం ప్రస్తావించలేదని తెలుస్తోంది. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాత్రం కొప్పుల నివాసానికి వెళ్లి గంటసేపు సమావేశమయ్యారు. మంత్రి ఈటెల సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు కొందరు కొప్పులతో ఫోన్‌లో మాట్లాడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించినట్లు తెలి సింది. మరోవైపు ఆదివారంరాత్రి మంత్రి సహా ఎంపీలు, ఎమ్మెల్యేలంతా జ్వరంతో బాధపడుతున్న చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించడం గమనార్హం.
అనుచరుల ఆగ్రహం
కొప్పులకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆదివారం ఉదయం నుంచే జిల్లా కేంద్రంలోని శ్రీపురంకాలనీలో ఉన్న కొప్పుల నివాసానికి అనుచరులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వందలాదిగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. పార్టీకి అండగా ఉన్న ఈశ్వర్‌కు అన్యాయం జరిగిందంటూ పలువురు కార్యకర్తలు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చీఫ్ విప్ తీసుకోవద్దంటూ కొప్పులకు సూచించారు.
మాలల ఆందోళన ఉధృతం
తమ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్‌కు మంత్రి పదవి కాకుండా చీఫ్ విప్ ఇవ్వడంపై మాలలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం జిల్లావ్యాప్తంగా పలు చోట్ల మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కొప్పుల నివాసంలో ఆయనకు సంఘీభావం పలికిన మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కనకరాజ్ అనంతరం మాట్లాడుతూ మాలల ఆత్మగౌరవం దెబ్బతీశారన్నారు. కేసీఆర్ వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకుని, ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలపై అసహనం
తనకు మద్దతుగా మాలమహానాడు చేస్తున్న ఆందోళనలపై ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు మాలమహానాడు నాయకులు నిరసన తెలిపి, మీడియాతో మాట్లాడుతుండగా, కొప్పుల స్వయంగా వచ్చి వారించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దంటూ ఒకింత ఆగ్రహంతో పేర్కొన్నారు.
కొప్పులకు మంత్రి పదవి ఇవ్వాలని ఆత్మహత్యాయత్నం
మంకమ్మతోట/కరీంనగర్ : కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా చీఫ్ విప్ పదవి ఇవ్వడాన్ని నిరసిస్తూ జిల్లాకేంద్రంలో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేసుకున్నా రు. తెలంగాణ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, దాసం నాగేందర్, బోడ కమలాకర్, కర్ణె కనుకయ్యతోపాటు మరికొందరు కలెక్టరేట్ భవనంపైకి ఎక్కి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్‌లో మాలమహానాడు మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టగా అదే సమయంలో వెల్గటూర్ ఎంపీటీసీ వెంకటేశ్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అప్రమత్తమై అతడిని నిలువరించారు. ఆందోళనకారులనందరినీ వన్‌టౌన్‌కు తరలించారు. జిల్లాలో పలుచోట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ధర్మపురిలో రాస్తారోకో చేశారు. మేడి అంజయ్య, రేణుక, దశరథం, నాయకులు పాల్గొన్నారు.
ఔననలేక..కాదనలేక!
Published Mon, Dec 15 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 6:10 PM
Advertisement