
సాక్షి, సిటీబ్యూరో: రాజధాని రాజకీయం మళ్లీ వేడెక్కబోతోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణకు, లోక్‌సభ ఎన్నికలకు లింకు పెట్టే దిశగా అధికార టీఆర్‌ఎస్ మంత్రాంగం మొదలైంది. నగరం నుంచి గత కేబినెట్‌లో నలుగురు మంత్రులకు ఛాన్స్ రాగా, ఈ మారు ముగ్గురికి మించని పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన ఆ ఒక్కరిని లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ నూతన కేబినెట్‌లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు చోటు దక్కుతుందన్న విశ్వాసంలో ఉన్నారు. ఏ కారణాల వల్ల అయినా కేబినెట్‌లో చోటు దక్కని అభ్యర్థిని లోక్‌సభకు పంపే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి నగరంలో మల్కాజిగిరి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన మల్లారెడ్డి ఇటీవలి ఎన్నికల్లో మేడ్చల్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించగా, సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి 2014లో పోటీ చేసిన భీంసేన్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. చేవెళ్ల నుంచి విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీకీ రాజీనామా చేయటంతో ఈ మూడు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తప్పనిసరిగా కొత్త అభ్యర్థులను నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
మల్కాజిగిరిలో ఎవరు?
మేడ్చల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చామకూర మల్లారెడ్డి స్థానంలో కొత్త అభ్యర్థికే టీఆర్‌ఎస్ పట్టం కట్టనుంది. ఈ నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి సమీప బంధువు, పార్టీ నాయకుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుమారుడు భద్రారెడ్డిలతో పాటు ముఖ్య నాయకుడు బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల పేర్లపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ముందస్తు ఎన్నికలకు ముందు బండారి లక్ష్మారెడ్డితో పాటు సుధీర్‌రెడ్డికి సైతం ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి అవకాశం ఇస్తే పార్టీ మారేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత ఒకరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిల చుట్టే చర్చ సాగుతోంది. వచ్చే కేబినెట్‌లో దక్కే స్థానాల మేరకు సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి ఖరారయ్యే అవకాశం ఉంది. ఇక చేవెళ్ల లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌కు బలమైన అభ్యర్థి ప్రస్తుతానికి కనిపించటం లేదు. సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లటంతో సరైన అభ్యర్థి కోసం టీఆర్‌ఎస్ వేట తీవ్రం చేసింది. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పరిశీలించటంతో పాటు అవసరమైతే పోటీలో నిలిపేందుకు కాంగ్రెస్‌లో ఇద్దరు ముఖ్యమైన నేతలను టచ్‌లోకి తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.