డీసీసీబీ చైర్మన్ జంగాపై వేటు! | trs mlas complaint against janga raghavareddy | Sakshi
Sakshi News home page

డీసీసీబీ చైర్మన్ జంగాపై వేటు!

Published Wed, Apr 12 2017 3:41 AM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

డీసీసీబీ చైర్మన్ జంగాపై వేటు!

డీసీసీబీ చైర్మన్ జంగాపై వేటు!

వరంగల్‌ డీసీసీబీలో అక్రమాలు
చైర్మన్‌ రాఘవరెడ్డిపై సీఎంకు ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఫిర్యాదు
ప్రాథమిక విచారణలో అక్రమాల ధ్రువీకరణ..
పాలకవర్గంపై వేటుకు సర్కారు మొగ్గు


సాక్షి, హైదరాబాద్‌: అక్రమాల ఆరోపణలు వరంగల్‌ సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) పాలకవర్గం రద్దుకు దారి తీస్తున్నాయి. డీసీసీబీ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు. డీసీసీబీలో అక్రమాలు, చైర్మన్‌ రాఘవరెడ్డి అవినీతిపై అదే జిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సహకార శాఖ ఉన్నతాధికారులు ప్రాథమికంగా విచారణ పూర్తి చేశారు. మార్చి 22న వరంగల్‌ డీసీసీబీ కార్యాలయానికి వచ్చి అధికారులు రికార్డులను పరిశీలించారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. విచారణ నివేదికలను సీఎం కార్యాలయానికి, హైదరాబాద్‌లోని నాబార్డు, ఆర్‌బీఐ అధికారులకు పంపారు.

ప్రాథమిక విచారణ నివేదికలో అధికారులు పాలక వర్గాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. అక్రమాల్లో భాగస్వాములైన అధికారులపైనా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. విచారణ నివేదిక ఆధారంగా వరంగల్‌ డీసీసీబీ పాలకవర్గాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా సహకార చట్టంలోని 51 సెక్షన్‌ ప్రకారం కూడా విచారించాలని సహకార శాఖ ఉన్నతాధికారులు సోమవారం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నివేదిక రాగానే... పాలకవర్గాన్ని రద్దుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకోనుంది. జంగా రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మరో ఐదుగురు ఎమ్మెల్యేలతో కలసి డీసీసీబీలో అక్రమాలపై సీఎంకు ఫిర్యాదు చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

రైతుల కోసం నాబార్డు కేటాయించిన రూ.50 లక్షల నిధులలో ఒక్క రూపాయి కూడా అన్నదాతలకు ఇవ్వకుండా రాఘవరెడ్డి మొత్తం తన పేరిటే తీసుకున్నారని, అలాగే కుటుంబ సభ్యులకు భారీగా ప్రయోజనం చేకూర్చేలా రుణాలు పొందారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సీఎంకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాఘవరెడ్డి ప్రాతినిధ్యం వహించే దర్గా కాజీపేట సొసైటీలో కుటుంబీకులందరి పేరిట పంట రుణాలు, ఇతరుల పేరుతో బినామీ రుణాలు తీసుకున్నారని, మళ్లీ ఇవే భూములపై మార్టిగేజ్‌ రుణాలు పొందారని పేర్కొన్నారు. ఇలా ఎమ్మెల్యేలు మొత్తం 16 అంశాలపై ఫిర్యాదులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement