‘కంటి వెలుగు’పై టీఆర్‌ఎస్ భారీగా ఆశలు పెట్టుకుంది. ‘కారు’కు గెలుపుబాట చూపుతుందని భావిస్తోంది. ఆ పథకం కింద కంటి పరీక్షలు నిర్విఘ్నంగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులు గుర్తు పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేస్తారని ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు భావిస్తున్నారు. కంటి పరీక్షల సంఖ్య ఈ నెలాఖరులోగా కోటికి చేరుకోవచ్చని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెల 20వ తేదీ నాటికి 87.16 లక్షలమందికి కంటి పరీక్షలు చేశారు. రోజుకు సరాసరి 1.15 లక్షలమందికి పరీక్షలు చేస్తున్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం సాగుతోందని గ్రామాల్లో విస్తృత ప్రచారం జరుగుతుండటంతో అది తమకు కలసి వస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
బడుగు, బలహీన వర్గాలే బాధితులు
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించాలన్న ఉద్దేశంతో ఆగస్టు 15న ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,956 గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. అంటే సగం గ్రామాల్లో ఈ పథకం కింద కంటి పరీక్షలు పూర్తిచేశారు. ఈ పథకాన్ని అధికంగా పేదలు, బడుగు, బలహీన వర్గాల వారే ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బీసీలు 49.41 లక్షల (56.68%) మంది ఉండటం గమనార్హం. ఎస్సీలు 17.01, ఎస్టీలు 10.62 శాతం ఉన్నారు. మైనారిటీలు 5.17 శాతమున్నారు. అంటే దాదాపు 90శాతం వరకు ఆయా వర్గాలకు చెందినవారే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఏళ్లుగా తమ కళ్ల గురించి పట్టించుకున్న నాథుడే లేరని ఆయా వర్గాల ప్రజలు భావించేవారు. కంటి వెలుగు పరీక్షలతో ప్రభుత్వం తమకు ప్రయోజనం చేకూర్చిందన్న భావన వారిలో ఏర్పడింది. కళ్లు కనబడటంలేదని అనుకోవడమే కానీ, ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే పరిస్థితి వారికి ఉండేదికాదు. అయితే, గ్రామాల్లోనే కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తుండడంతో కంటి పరీక్షలు చేయించుకునేందుకు పెద్దఎత్తున జనం ముందుకు రావడం గమనార్హం.
40 ఏళ్లకు పైబడినవారే అధికం
ఇప్పటివరకు కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో 33.46 లక్షల(38.39%) మందికి ఏదో ఒక లోపం ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. అందులో 15.18 లక్షలమందికి అక్కడికక్కడే ఉచితంగా రీడింగ్ గ్లాసులు ఇచ్చారు. రీడింగ్ గ్లాసులు తీసుకున్నవారిలో 12.53 లక్షలమంది 40 ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. వారు కాకుండా చత్వారంతో బాధపడుతున్నవారు 12.07 లక్షల మంది ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 84 వేలు అందజేశారు. ఇంకా లక్షలాది మందికి ఇవ్వడంలో నిర్లక్ష్యం కనిపిస్తున్నా త్వరలోనే అందజేస్తామని అధికారులు చెబుతు న్నారు. వీరుగాక 50 ఏళ్లు పైబడిన వారిలో 6.20 లక్షల మందికి క్యాటరాక్ట్ సహా ఇతర ఆపరేషన్లు చేయాల్సిన అవసరముందని నిర్ధారించారు. ఎన్నికల తర్వాత ఆపరేషన్లు చేస్తారని అధికారులు చెబుతున్నారు. కంటి సమస్యలున్నవారు 40 ఏళ్లకు పైబడిన వారే ఉండటం, ఏళ్లుగా ఎవరూ చేయని విధంగా ఉచిత కళ్లద్దాలు, ఆపరేషన్లు చేయనుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, అది తమకు ఎన్నికల్లో ప్రయోజనం కలిగిస్తుందని టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి.
►6.20లక్షలు ఆపరేషన్లు చేయాలని నిర్ణయించిన వారు
►15.18లక్షలు రీడింగ్ గ్లాసులు పొందిన వారి సంఖ్య
►90% లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల శాతం
Comments
Please login to add a commentAdd a comment