బీజేపీపై మండిపడ్డ టీఆర్ఎస్
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డిని ఎంపిక చేయడం పట్ల తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మండిపడింది. శనివారం ఆ పార్టీ ప్రతినిధులు హైదరాబాద్లో మాట్లాడుతూ... రౌడీ, గుండా అయిన జగ్గారెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణ వద్దన్నా జగ్గారెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారంటూ బీజేపీని వారు ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయిన కిషన్రెడ్డి కేవలం అంబర్పేట నాయకుడిగానే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో మెదక్లో బీజేపీని ఇప్పటికే ప్రజలు తిరస్కరించారని టీఆర్ఎస్ గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో తాను విభజనక వ్యతిరేకం మంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆయన అప్పటి యూపీఏ ప్రభుత్వానికి లేఖలు రాశారు. దాంతో టీఆర్ఎస్ మెదక్ ఉప ఎన్నికలల్లో తెలంగాణ వ్యతిరేకి అయిన జగ్గారెడ్డిని ఎలా బరిలోకి దింపుతారంటూ బీజేపీని ప్రశ్నించింది. మెదక్ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రసవత్తరమైన పోరు జరుగుంది. దాంతో ఆయా పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.