‘ఈటెల’.. ఏమిటిలా! | TS finance minister Etela Rajender exclusive with Tv9 on Telangana | Sakshi
Sakshi News home page

‘ఈటెల’.. ఏమిటిలా!

Published Thu, Mar 12 2015 3:44 AM | Last Updated on Tue, Oct 2 2018 4:41 PM

‘ఈటెల’.. ఏమిటిలా! - Sakshi

‘ఈటెల’.. ఏమిటిలా!

బంగారు తెలంగాణకు బాట అన్న ప్రభుత్వం బడ్జెట్‌లో అంకెలగారడీ చేసిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ జిల్లాపై చిన్నచూపు చూపారని విమర్శలు వస్తున్నాయి. సాగు నీటి ప్రాజెక్టులకు అరకొర నిధులు..సంక్షేమ పథకాలకు నామమాత్రం కేటాయింపులతో జిల్లా ప్రజల ఆశలు ఆవిరయ్యూయి.      
     
- రాష్ట్ర బడ్జెట్‌లో జిల్లాపై చిన్నచూపు
- సాగునీటి ప్రాజెక్టులకు స్వల్ప నిధులు
- రాజీవ్‌సాగర్‌కు రూ.25 కోట్లు

- ఇందిరాసాగర్‌కు రూ.10 కోట్లు
- పెదవాగుకు రూ.50 కోట్లు
- పెద్ద ప్రాజెక్టులకు అరకొర నిధులు
- రైతు రుణమాఫీకి నామమాత్రమే

సాక్షి, ఖమ్మం: బంగారు తెలంగాణ ధ్యేయం అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసుల ఆశలను ఆవిరి చేసింది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు అత్తెసరుగా నిధులు కేటాయించి జిల్లాపై వివక్ష చూపింది. భారీ మొత్తంలో నిధులు విడుదలై ప్రాజెక్టుల పూర్తి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందనుకున్న రైతుల కలలు కల్లలయ్యాయి. ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే బడ్జెట్‌లో జిల్లాకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపు లేకపోవడం గమనార్హం.  
 
ఈ బడ్జెట్‌లో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు వస్తాయని జిల్లా ప్రజలు ఆశించారు. కానీ ప్రభుత్వం స్వల్పంగా నిధులు కేటాయించడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పట్లో పూర్తికానట్లే. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో  ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులకు నిధులు కేటాయింపు లేకపోవడంతో గడువు దాటినా ఈ ప్రాజెక్టుల నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులపై శీతకన్నే వేసింది.
 
ఇందిరాసాగర్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,824 కోట్లు. కానీ ఇప్పటి వరకు నిధులు రూ.1,150.36 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.886.533 కోట్లు ఖర్చు చేశారు. 2011-12 నాటికి అన్నిరకాల పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ప్రభుత్వం గత బడ్జెట్‌లో రూ.5 కోట్లు కేటాయిస్తే.. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించింది. గడువు దాటినా నిధుల కేటాయింపు తక్కువగా ఉండటంతో ఈ ప్రాజెక్టు ఇక ఇప్పట్లో పూర్తి కానట్లేనని విపక్ష నేతలు అభిప్రాయపడుతున్నారు.
 
జిల్లాతో పాటు వరంగల్ జిల్లాల్లోని సుమారు 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో రాజీవ్‌సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దీనికి భారీ ఎత్తున నిధులు విడుదల అవుతాయని ఇరు జిల్లాల రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా తెలంగాణలోని  ఈ రెండు జిల్లాల్లోని భూములనే సస్యశ్యామలం చేస్తున్నా కేవలం ఈ బడ్జెట్‌లో రూ.25 కోట్లు మాత్రమే విదిల్చారు. ఈ నిధులు ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగిరం కావడానికి ఏమాత్రం సరిపోవు.
 
గత ఏడాది నవంబర్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో నూతన ప్రభుత్వం పెద్దవాగు ప్రాజెక్టుకు రూ.20 లక్షలు కేటాయిస్తే ప్రస్తుతం రూ. 50కోట్లు కేటాయించారు. అశ్వారావుపేట మండలంలోని పెదవాగుపై అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రిజర్వాయర్ నిర్మాణానికి చొరవ చూపారు. మొత్తంగా అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి.

అయితే కుడి ఎడమ కాల్వల ద్వారా అశ్వారావుపేట మండలంలో 2 వేలు, వేలేరుపాడు మండలంలో 4 వేలు, కుక్కునూరులో మరో 4వేల ఎకరాల ఆయకట్టుకే నీరు అందుతోంది. పంట భూముల చివరి వరకు కాల్వలు లేకపోవడం, ఉన్న కాల్వలు శిథిలావస్థకు చేరాయి. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించినా ఆంధ్రప్రదేశ్‌లోకి కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వెళ్లాయి. మేజర్ ఆయకట్టు అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ నిధుల ద్వారా ఎక్కువగా ఆ రాష్ట్ర రైతులే లబ్ధి పొందే అవకాశం ఉంది.
 
గోదావరి నీటినిృకష్ణా నదికి అనుసంధానం చేసే దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టెయిల్‌పాండ్‌కు గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తే.. ఈ బడ్జెట్‌లో రూ.కోటి కేటాయించింది. ఇక జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు గత బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో రూ.196. 47 కోట్లు కేటాయించారు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో నల్లగొండతోపాటు జిల్లా కూడా ఉండటంతో మనకు రూ.100 కోట్ల వరకు రానున్నాయి.
 వెంకటాపురం మండల పరిధిలోని మల్లాపురం గ్రామ సమీపంలో పాలెంవాగు ప్రాజెక్టు నిర్మాణాన్ని 2005లో 10 వేల ఏకరాలకు సాగునీరు అందించేందుకు రూ.70.90 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ప్రాజెక్టు వ్యయం 148.99 కోట్లకు చేరింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావస్తోంది. గత బడ్జెట్‌లో రూ.కోటి కేటాయిస్తే ఈ బడ్జెట్‌లో రూ.5కోట్లు కేటాయించారు.
 
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) ద్వారా జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, ముదిగొండ, ఖమ్మం రూరల్ మండలాల్లో సుమారు 79వేల ఎకరాలు సాగులోకి రావాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏళ్లుగా సాగుతోంది. ప్రధానంగా వరంగల్ నుంచి జిల్లాలోకి ఈ కాల్వకు సంబంధించిన లింక్ కాల్వల తవ్వకం జరగలేదు. ఈ బడ్జెట్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పీకి భారీ ఎత్తున రూ.747 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలోని ఈ ఆయకట్టుకు కూడా లింక్ కాల్వల నిర్మాణం చేపట్టవచ్చని రైతులు ఆశిస్తున్నారు.
 
వ్యవసాయ రుణమాఫీ కింద జిల్లాకు రూ.1500 కోట్లు రావాల్సి ఉంది. 2.90 లక్షల మంది రైతులను లబ్ధిదారులుగా గుర్తించారు. గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.364 కోట్లను జిల్లాకు మంజూరు చేసింది. ఈ బడ్జెట్‌లో రుణమాఫీ కింద రూ.4,800 కోట్లను చూపింది. ఈ లెక్కన జిల్లాకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణమాఫీ కింద సుమారు రూ.500 కోట్ల వరకు రానున్నాయి.
 
దళితులకు భూమి కొనుగోలు కింద జిల్లాలో కేవలం కొంతమందికే అట్టహాసంగా భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు. 2 వేలమందికి పైగా లబ్ధిదారులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే జిల్లాకు కేవలం రూ.100 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అయితే అర్హులైన లబ్ధిదారుల్లో కేవలం 200 మందికే ఈ ఆర్థిక సంవత్సరంలో లబ్ధి కలగనుంది. మిగతా లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పవు.
 
- గతంలో జిల్లా కేంద్ర ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఆస్పత్రి గురించి బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేదు.
 - ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు కొంతమేర నిధులు కేటాయించడంతో జిల్లాలోని ఈ వర్గాలకు ఊరట కలగనుంది.
- రూ.3లక్షలతో డబుల్ బెడ్ రూమ్, కిచెన్‌తో నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ బడ్జెట్‌లో ఈ గహ నిర్మాణాలకు నిధుల కేటాయింపు చేయలేదు. లక్ష మంది వరకు నిరుపేదలు జిల్లాలో ఇప్పటికేృగహ నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరంతా డబుల్ బెడ్‌రూమ్ ఇంటి నిర్మాణం కోసం ఎదురు చూసినా ప్రభుత్వం వారి ఆశలపై నీరు చల్లింది.
- గతంలో అంగన్‌వాడీ కార్యకర్తల వేతనం రూ.4,200 ఉండగా ఇప్పుడు రూ.7,000కు పెంచారు. సహాయ కార్యకర్తలకు గతంలో రూ.2,450 వేతనం ఇవ్వగా దీన్ని రూ.4,500కు పెంచారు. జిల్లాలో 3299 మంది కార్యకర్తలు, 1006 మంది సహాయ కార్యకర్తలకు ఊరట దక్కింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement