‘బడ్జెట్ భేటీ’ల్లో కన్పించని ఆర్థికమంత్రి ఈటల
► సమీక్షలు, సమావేశాలకు దూరం
► సీఎం నేతృత్వంలోనే కీలక భేటీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ తయారీ ప్రక్రియలో ఈసారి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అంటీముట్టనట్టుగా ఉండటం ప్రభుత్వ వర్గాలు, అధికార పార్టీ శ్రేణుల్లో చర్చనీయంగా మారింది. వరుసగా జరుగుతున్న శాఖలవారీ బడ్జెట్ సమీక్షలు, సమావేశాలన్నీ రెండు నెలలుగా ఆయన ప్రమేయం లేకుండానే చకచకా జరిగిపోతున్నాయి. రెండ్రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న బడ్జెట్ సమీక్ష సమావేశాల్లో కూడా ఈటల పాల్గొనలేదు. ఆయనకు సమాచారం లేకుండానే ఈ సమీక్షలు జరుగుతున్నాయా అన్నదానిపై ఆర్థిక శాఖ వర్గాలు కూడా ఏమీ చెప్పలేకపోతున్నాయి. రెండు రోజులుగా ఈటల కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన మంత్రి ఈటల, ఆయన వెంట రాజ్‌భవన్‌కు కూడా వెళ్లారు. కానీ తర్వాత జరిగిన బడ్జెట్ సమీక్షకు మాత్రం గైర్హాజరయ్యారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచీ ఆర్థికమంత్రిగా ఉన్న ఈటల అసెంబ్లీలో వరుసగా గత రెండు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఆ రెండుసార్లు బడ్జెట్ తయారీలో, సమీక్షల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఆయన తయారు చేసిన ముసాయిదా ప్రతిని సీఎం పరిశీలించి సలహాలు సూచనలు, మార్పులు చేర్పులతో తుది బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈసారేమో బడ్జెట్ కసరత్తు మొదలైనప్పట్నుంచీ ఈటల దూరంగా ఉన్నారు. ఇటీవల వరుసగా రెండుసార్లు జరిగిన కేబినేట్ సమావేశాల్లోనూ కేసీఆర్ అన్నీ తానై బడ్జెట్‌పై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు. ప్రభుత్వ పథకాలు, పద్దుల కుదింపు, విలీనంపై సమీక్షించాలంటూ అదే సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి సూచించారు. దాంతో ఎన్నడూ లేనివిధంగా ప్రణాళికా సంఘం అధ్వర్యంలో వరుసగా నాలుగు రోజులు అన్ని శాఖల అధికారులు సమావేశమవటం హాట్‌టాపిక్‌గా మారింది. ఈటల ప్రస్తుతం ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖ బాధ్యతలు కూడా చూస్తున్నారు.
నేడు ఢిల్లీకి ఈటల
ఇటీవల వరుసగా రెండుసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. శుక్రవారం మరోమారు ఢిల్లీ వెళ్తున్నారు. జైట్లీ ఆధ్వర్యంలో పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వస్తు సేవల పన్నుపై ఏర్పాటు చేసిన ఎంపవర్డ్ కమిటీ భేటీలో ఈటల పాల్గొంటారు.