సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేట్ బస్సులు సమ్మెను సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. అడ్డగోలు చార్జీలతో ఇష్టారాజ్యంగా దారిదోపిడీకి పాల్పడుతున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేసే ప్రైవేట్ ఆపరేటర్లు ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రతిపాదన నేపథ్యంలో మరింత రెచ్చిపోతున్నారు. దసరా సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకవైపు దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ 50 శాతం అదనపు దోపిడీకి పాల్పడుతుండగా, ప్రైవేట్ ఆపరేటర్లు మరో అడుగు ముందుకేసి వంద శాతం దోపిడీ కొనసాగిస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్న దృష్ట్యా ప్రైవేట్ బస్సుల్లో ముందస్తుగా బుక్ చేసుకోవడమే మంచిదంటూ ప్రయాణికులపైన ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఒకవేళ కార్మికుల సమ్మె అనివార్యమైతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందనే ఉద్దేశంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపైనే ఆధారపడి ముందస్తు బుకింగ్‌లకు సిద్ధపడుతున్నారు. దీంతో అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, మియాపూర్, బీహెచ్‌ఈఎల్, లక్డీకాపూల్, కోఠీ, కాచిగూడ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సుల బుకింగ్ కేంద్రాల వద్ద అడ్వాన్స్ బుకింగ్‌ల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు వివిధ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ బస్సుల పరిమితిని, రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపైన ఆధారపడాల్సి వస్తుంది. విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, చిత్తూరు, కడప, బెంగళూరు, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు రెట్టింపు కంటే ఎక్కువ చార్జీలు చెల్లించుకోవలసి వస్తోంది. మరోవైపు రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా అప్పటికప్పుడు చార్జీలను పెంచేస్తున్నారు.
ఆర్టీసీ 50 శాతం అ‘ధన’ం...
దసరా రద్దీ దృష్ట్యా ఈసారి 4933 బస్సులు అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. గత నాలుగు రోజులుగా రెగ్యులర్ బస్సులతో పాటు, రద్దీకి అనుగుణంగా వివిధ రూట్లలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవైపు ఆర్టీసీ సమ్మె ముంచుకొస్తుండగా మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ యదావిధిగా 50 శాతం అదనపు చార్జీలతో ప్రయాణికులపైన దోపిడీ కొనసాగిస్తోంది. తెలంగాణ పరిధిలో అదనపు చార్జీలు ఉండబోవని, 200 కిలోమీటర్‌లు దాటి వెళ్లే బస్సుల్లో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పారు. కానీ ప్రత్యేక బస్సులన్నింటిలోనూ 50 శాతం అదనపు చార్జీలు విధిస్తున్నట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘సాధారణ రోజుల్లో జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి నిర్మల్‌కు ఇలాగే అదనపు చార్జీలు చెల్లించవలసి వచ్చిందని’ నారపల్లిలో ఉంటున్న ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తంచేశారు. ప్రైవేట్ దోపిడీ తరహాలోనే ఇది ప్రభుత్వరంగ దోపిడీ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న 5వ తేదీ నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక్క రోజే సుమారు 1000 బస్సులను అదనంగా నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 5,6 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు తరలి వెళ్లనున్నారు. అలాగే తిరుగు ప్రయాణికులకు సైతం ఆర్టీసీ బస్సులపైన ఆధారపడాల్సి ఉంటుంది. సమ్మె అనివార్యమైతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావలసిందే.
రైళ్లలో కిటకిట...
ప్రతిరోజు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లతో పాటు, ప్రత్యేక రైళ్లలోనూ రద్దీ పెరిగింది. వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో రిజర్వేషన్లు లభించని ప్రయాణికులు సాధారణ బోగీలపైన ఆధారపడాల్సి వస్తోంది. దీంతో అన్ని రైళ్లలో రద్దీ కిక్కిరిసిపోతోంది. హైదరాబాద్ నుంచి ముంబయి, పట్నా, దిల్లీ, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వైపు వెళ్లే రైళ్లలో భారీ రద్దీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment