ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు.. ప్రయాణికులకు షాక్‌ | TSRTC: Good News Telangana RTC Workers | Sakshi

ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు.. ప్రయాణికులకు షాక్‌

Published Thu, Nov 28 2019 8:06 PM | Last Updated on Thu, Nov 28 2019 9:13 PM

TSRTC: Good News Telangana RTC Workers - Sakshi

ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రేపు(శుక్రవారం) విధుల్లో సంతోషంగా చేరాలని ఆదేశించారు. ఎటువంటి షరతులు లేకుండా విధుల్లో చేరొచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించిన సీఎం కేసీఆర్‌ ప్రయాణికులపై భారం మోపారు. టిక్కెట్‌ చార్జీలు పెంచారు. కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు తెలిపారు. పెంచిన చార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఆర్టీసీ ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోలుకునేందుకు తాత్కాలికంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. కార్మిక సంఘాలను క్షమించబోమని అన్నారు. సమ్మె సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని భరోసా యిచ్చారు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు.

ఆర్టీసీ కార్మికులు క్రమశిక్షణతో ఉంటే సింగరేణిలా బోనస్‌లు ఇప్పిస్తానని, క్రమశిక్షణారాహిత్యాన్ని సహించబోమని హెచ్చరించారు. డిపో నుంచి ఇద్దరితో వర్కర్ వెల్ఫేర్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు రియలైజ్ కావాలనే తాను సమ్మె పట్ల కఠినంగా వ్యవహరించానని వెల్లడించారు. కార్మిక నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఆర్టీసీ కార్మికులను మోసం చేశారని విమర్శించారు. అడ్డం పొడవు మాట్లాడి ఇంకా కార్మికులను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.



ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించానని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ సంస్థ బతకాలన్నది తన ఉద్దేశమని, కార్మికుల మంచిచెడులు చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘మీరు బతకండి.. సంస్థను బతికించండి’ అంటూ ఆర్టీసీ కార్మికులకు హితవు పలికారు. వారం తర్వాత ఆర్టీసీ కార్మికులను ప్రగతి భవన్‌కు పిలిచి స్వయంగా మాట్లాడతానని చెప్పారు. ఆర్టీసీ సంబంధించిన అన్ని వివరాలను వారికి అందజేస్తానని అన్నారు. ఆర్టీసీని ఏం చేయాలో కార్మికులే చెప్పాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులపై తమకు ఎటువంటి కక్ష లేదని కేసీఆర్‌ చెప్పారు.

కేసీఆర్‌ ఇంకా ఏమన్నారంటే...
ఆర్టీసీపై మేము అనుకున్నది వేరు. బయట సన్నాసులు ప్రచారం చేసింది వేరు. టెంట్ కనిపిస్తే మాట్లాడే వాళ్లు ఏదేదో మాట్లాడి ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారు. ఆర్టీసీ కార్మికులకు అనవసర ఆశలు కల్పించి, ఓట్ల కోసం చలి మంటలు కాచుకున్నారు. సమ్మె చట్టవిరుద్ధం అని చెప్పడానికి లేబర్ కోర్ట్ అవసరం లేదు. అతి కల్పించింది ఆర్టీసీ కార్మిక నేతలు, ప్రతిపక్షాలే. అడ్డం పొడవు మాట్లాడి కార్మికులను మభ్యపెడుతున్నారు. కేంద్రంలో ఎల్లయ్యకు చెప్తే ఏమవుతుంది? తియ్యటి, పుల్లటి మాటలు తప్ప కేంద్రం నుంచి 5 వందల కోట్లు తెస్తారా? ఆర్టీసీ కార్మికులకు ఒక్క అవకాశం​ ఇవ్వాలని మంత్రులు చెప్పారు. కార్మికులు ఇప్పటికైనా రియలైజ్ కావాలి. బాధ్యత గల ప్రభుత్వంగా సంస్థ మనుగడ కోసం చార్జీలు పెంచుతున్నాం. ఆర్టీసీని పెట్టుబడుదారులకు ఇవ్వం. ఆరు రోజుల్లో ఢిల్లీ వెళ్లి వచ్చి అన్ని డిపోల నుండి 5 మంది కార్మికులతో స్వయంగా మాట్లాడతా. యూనియన్లను రానివ్వం. చిల్లర మాటలు పట్టించుకోము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement