కుత్బుల్లాపూర్ : కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న కళాశాల బస్సును బైక్ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృత్యువాతపడ్డారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు, ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం.. మెదక్ జిల్లా జిన్నారం మండలం చెట్లపోతారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ చిన్న కుమారుడు మద్దులపటేల్ శ్రీధర్(22) కండ్లకోయలోని సీఎంఆర్ కాలేజీలో బీటెక్ తృతీయ సంవత్సరం, షాపూర్‌నగర్‌కు చెందిన రఘుపతి పెద్ద కుమారుడు దూపనపల్లి నవీన్(21) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.
స్నేహితులైన వీరిద్దరూ శనివారం సాయంత్రం కళాశాల నుంచి బైక్‌పై బహదూర్‌పల్లి వైపు వస్తూ మైసమ్మగూడ మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న కారును ఓవర్‌టేక్ చేశారు. ఇదే క్రమంలో ఎదురుగా వచ్చిన ఎంఎల్‌ఆర్ ఐటీ కళాశాల బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శ్రీధర్, నవీన్ తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని సూరారంలోని నారాయణ హృదయాలయకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు బీటెక్ విద్యార్థుల దుర్మరణం
Published Sun, Jun 28 2015 1:23 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM
Advertisement
Advertisement