జెడ్పీ స్థాయి సంఘాల ఎన్నికఏకగ్రీవం
జిల్లా పరిషత్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఉన్న సభ్యుల బలాబలాలను బట్టి స్థాయి సంఘాల ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని అందరూ భావించారు. కానీ.. ఇందుకు భిన్నంగా సాఫీగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు సంబంధించి చైర్మన్లతోపాటు కమిటీ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియపై జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన చర్చ ప్రారంభం కాగా... జెడ్పీటీసీ సభ్యులు ఏకగ్రీవానికి ఒప్పుకోవడంతో పది నిమిషాల్లో ముగిసింది. మిగిలిన తంతు, బాధ్యతల స్వీకరణ మధ్యాహ్నం 3 గంటలకు వరకు కొనసాగింది.
సాక్షి, హన్మకొండ : జిల్లా పరిషత్ స్థాయి సంఘాల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఏడు స్థాయి సంఘాలకు సంబంధించి చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11:00 గంటలకు మొదలైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 3:00 గంటలకు వరకు కొనసాగింది.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ, డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్, ఎమ్మెల్సీలు బోడ కుంటి వెంకటేశ్వర్లు, నాగపురి రాజలింగం, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, అరూరి రమేష్, ఫ్లోర్ లీడర్లు సకినాల శోభన్, మూలగుండ్ల వెంకన్న, లేతాకుల సంజీవరెడ్డి, కోఆప్టెడ్ సభ్యులు ఇబ్రహీం, నభీ, ఇన్‌చార్జ్ సీఈవో వాసం వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఈఓ రమాదేవి, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, సునీత, కృష్ణమూర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
చైర్‌పర్సన్‌కే అధికారం
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ అధ్యక్షతన ప్రత్యేక సర్వసభ్య సమావేశం మొదలైంది. సమావేశం ప్రారంభం కాగానే స్థాయి సంఘాల ఎన్నికల సందర్భంగా కమిటీల్లో ప్రాతినిధ్యం కోసం జెడ్పీటీసీలు తమ నామినేషన్లు దాఖలు చేయాలని చైర్‌పర్సన్ పద్మ కోరారు. వెంటనే టీఆర్‌ఎస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్ మాట్లాడుతూ స్థాయి సంఘాల్లో సభ్యులకు అవకాశం కల్పించే అధికారం జెడ్పీ చైర్‌పర్సన్‌కు అప్పగిస్తున్నట్లు తీర్మానాన్ని ప్రతిపాదించారు.
దీనిని కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ మూలగుండ్ల వెంకన్న, టీడీపీకి చెందిన వైస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ బలపరిచారు. ప్రతిపక్ష పార్టీల నుంచి మద్దతు లభించడంతో ఈ తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్‌పర్సన్ పద్మ ప్రకటించారు. దీంతో సమావేశం ముగిసింది. అనంతరం చైర్‌పర్సన్ చాంబర్‌లో నామినేషన్లు స్వీకరించారు. రెండు గంటల పాటు పార్టీ ఫ్లోర్ లీడర్లు, వైస్ చైర్మన్ చర్చించడంతో అన్ని కమిటీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రతి స్థాయి సంఘానికి అవసరమైన సంఖ్యలో నామినేషన్లు రావడంతో అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్‌పర్సన్ ప్రకటించారు.