
అన్నీ లోపాలే!
- బట్ట బయలవుతున్న ప్రయివేటు బడుల బాగోతం
- అసౌకర్యాల నడుమ తరగతుల నిర్వహణ
- మూత్రశాలలూ, మరుగుదొడ్లూ కరువే
- అధికారుల పరిశీలనలో వెల్లడవుతున్న నిజాలు
- నేడు కూడా కొనసాగనున్న తనిఖీలు
నిజామాబాద్ అర్బన్: ప్రయివేటు బడుల బాగోతం బట్టబయలవుతోంది. పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో తనిఖీలు ప్రారంభమయ్యాయి. డైట్‌కు చెందిన ఎనిమిది మంది లెక్చరర్లు గురువారం నగరంలోని పాఠశాలలను సందర్శించారు. వసతులపై ఆరా తీశారు. ఒక్కొక్కరు ఒక్కో పాఠశాలను పరిశీలించారు.
అంతటా అసౌకర్యాలే
జిల్లాలో 850 ప్రయివేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులు రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు. డిప్యూటీ ఈఓ పోచాద్రి, డైట్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో రెండు బృందాలు తనిఖీలలో పాల్గొం టున్నాయి. ఈ రెండు బృందాలు నగరంలోని 12 పాఠశాలలను తనిఖీ చేసాయి. ఆర్‌టీసీ కాలనీలో ఓ ప్రయివేటు పాఠశాలలో అధిక సంఖ్యలో సెక్షన్‌లు ఉన్నాయని, తగినన్ని మూత్రశాలలు లేవని వెలుగులోకి వచ్చింది. అనుభవం లేని ఉపాధ్యాయులు చదువు చెబుతున్నారని తేలింది.
వినాయక్‌నగర్‌లోని ప్రయివేటు ఓ పాఠశాలలో స్థాయికి మించి సెక్షన్‌లు నిర్వహిస్తున్నారని, తరగతి గదులు ఇరుకుగా ఉన్నాయని, శిక్ష ణ పొందిన ఉపాధ్యాయులు లేరని, వందలాది మంది విద్యార్థులకు ఒకే మూత్రశాల ఉందని బయటపడింది. మరికొన్ని పాఠశాలలలోనూ ఇదే పరిస్థితి ఉంది. మూత్ర శాలలు లేవని, భవనాలకు అగ్ని మాపక శాఖ అనుమతి కూడా లేదని, ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదని వెల్లడైంది. పలు పాఠశాలలో మైదానాలు లేక క్రీడలను నిర్వహించడం లేదు.
విద్యార్థులకు బోధన కూడా నామమాత్రంగా అందుతోంది. విద్యార్థుల నుంచి ముక్కు పిండి మరీ వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు పాఠశాలలలో సౌకర్యాల లేమి స్పష్టంగా బయటపడింది. కొన్ని పాఠశాలలకు ఆరవ తరగతి వరకు మాత్రమే అనుమతి ఉండగా, పదవ తరగతి వరకు నిర్వహిస్తున్నారు. చాలా వరకు బడులు నివాస భవనాలలోనే కొనసాగుతున్నాయి. శుక్రవారం కూడా తనిఖీలు కొనసాగనున్నాయి.