సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందని టీఆర్‌ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు పథకంతో తెలంగాణ రైతులకు సహాయం చేస్తోందని తాజా ఆర్థిక సర్వే తెలిపిందని, కానీ బడ్జెట్‌లో ఆ పథకానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ ముందుందని, విభజన హామీలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవని అన్నారు. దేశంలోనే గొప్ప ప్రాజెక్టైన కాళేశ్వరానికి కూడా నిధులు కేటాయించలేదని, ఇండస్ట్రీయల్ కారిడర్ విజ్ఞప్తులను ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
తెలంగాణకు ట్రైబల్ మ్యూజియం కేటాయించాలని కోరామన్నారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లె విధంగా బడ్జెట్ లేదని అభిప్రాయపడ్డారు. గతంలో 18 శాతం వృద్ధి రేటు ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత కేంద్ర విధానాల వల్ల వృద్ధి రేటు 9శాతానికి పడిపోయిందని తెలిపారు. ఎన్ని సమస్యలు వచ్చినా తెలంగాణ దేశంలోనే మెదటి స్థానంలో ఉందని అన్నారు.
మెదక్ ఎంపీ, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. బడ్జెట్‌లో తాము కోరిన 22 అంశాలకు కేటాయింపులు ఉంటాయని అనుకున్నామన్నారు. బడ్జెట్‌లో హర్ ఘర్ జల్ అన్నారని, తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ ముందే అమలు చేశారని తెలిపారు. రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టి రైతుల కోసం పనిచేస్తున్నామనడం చోద్యంగా ఉందని అన్నారు. జాతీయ రహదారులు, ప్రాజెక్టుల అంశాలు మాటే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణ నదీ ప్రాజెక్టులు, నీటి నిల్వలపై చేపల పెంపకం చేపట్టామని..ఆ కార్యక్రమం మంచిగా కొనసాగుతోందని అన్నారు. సాగర మిత్ర అనేది కేసీఆర్ ఎప్పుడో ప్రవేశ పెట్టారని పేర్కొన్నారు. పురాతన కట్టడాలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయని, పర్యాటక రంగానికి సంబంధించి నిధులు కేటాయించలేదని అన్నారు. విభజన హామీల ప్రస్తావనే లేదని, పాత సీసాలో కొత్త సారా పోసినట్టు బడ్జెట్ ఉందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు.
రాజ్యసభ సభ్యులు, బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడిగా ఉందని, రైతులను కేంద్రం మోసం చేసిందని మండిపడ్డారు. బడ్జెట్లో జీఎస్టీ బకాయిల అంశం లేదని ,తెలంగాణలోని అనేక సంక్షేమ పథకాలను కాపీ కొడుతున్నారని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని కోరామని, విభజన హామీల ప్రసక్తే లేదని అన్నారు. రాష్ట్రాలు బాగుంటేనే కేంద్రం బాగుంటుందన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు కూడా పోరాడాలని కోరారు.
చెవెళ్ల ఎంపీ, రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికే తెలంగాణ సంపద సృష్టిస్తోందని కేంద్రం చెప్పిందని, అన్ని రంగాల వారిగా వృద్ధి రేటులో తెలంగాణ ముందుందని అన్నారు. ప్రభుత్వం ఆర్ధిక మందగమనం నుంచి ఏ విధంగా బయట పడాలో ఆలోచన చేయడం లేదని, పక్క దేశాలు అవలంభిస్తున్న విధానాలు అవలంభించాలని తెలిపారు.
5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని సాధించాలంటే చాలా డబ్బులు కావాలని, కేంద్రం లెక్కల గారడి చేస్తోందని విమర్శించారు. పథకాల అమలులో తెలంగాణ ముందుందని తెలిపారు. అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా సాధ్యమని, బడ్జెట్‌ను వ్యతిరేకిస్తున్నామని రంజిత్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment