అమ్మాయిలు.. అభద్రత! | Unknown Person Entry in OU Ladies Hostel | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు.. అభద్రత!

Published Sat, Aug 17 2019 12:38 PM | Last Updated on Wed, Aug 21 2019 12:33 PM

Unknown Person Entry in OU Ladies Hostel - Sakshi

ఓయూ లేడీస్‌ హాస్టల్‌.. 2014లో ఓతాగుబోతు లోపలికి ప్రవేశించి విద్యార్థినులను బెదిరించాడు. వారు అప్రమత్తమై అతన్నిపట్టుకునేలోపే వెనుకవైపు నుంచి గోడ దూకి పారిపోయాడు.  
ఈ ఏడాది ఓ యువకుడు అర్ధరాత్రి హాస్టల్‌ గదిలోకి ప్రవేశించి దొంగతనానికిప్రయత్నించగా అమ్మాయిలు పట్టుకొనిదేహశుద్ధి చేశారు. అయితే నిందితుడు వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు.  
తాజాగా రెండు రోజుల క్రితం తెల్లవారుజామున ఓ అగంతకుడు విద్యార్థినుల హాస్టల్‌లోకి ప్రవేశించి ఓ అమ్మాయి గదిలో నుంచి సెల్‌ఫోన్‌ దొంగిలించాడు. అడ్డుకునేందుకుప్రయత్నించిన విద్యార్థినులను కత్తి చూపి బెదిరించి గోడ దూకి పారిపోయాడు.  
....ఇలా తరచూ సంఘటనలు జరుగుతున్నా ఓయూ అధికారులు పట్టించుకోవడం లేదు. భద్రత పెంపు విషయంలో చర్యలుతీసుకోవడం లేదు.  

తార్నాక: నగరంలో నేరాల నియంత్రణ.. మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఆధునిక పద్ధతులు.. కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండగా, యువతుల భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చే ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు. కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన చోట బయటి వ్యక్తులు సునాయాసంగా ప్రవేశించి దాడులు చేసి దర్జాగా పోతున్నారు. ముఖ్యంగా మహిళా హాస్టళ్లలో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. హాస్టళ్లలోకి ఆగంతుకులు చొరబడి విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో సుదూర ప్రాంతాలనుంచి ఓయూ క్యాంపస్‌కు వచ్చిన వారు ఇక్కడి హాస్టళ్లలో ఉండాలంటే భయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా పాలకవర్గం తీరు మారడంలేదు. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు సంఘటన జరిగినపుడు హడావిడి చేసి తర్వాత పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజుల క్రితం ఓ అగంతకుడు తెల్లవారు జామున విద్యార్థినుల హాస్టల్‌లోకి ప్రవేశించి ఓ అమ్మాయి గదిలో సెల్‌ఫోన్‌ దొంగిలించడమే కాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమెతో పాటు ఇతర విద్యార్థినులను కత్తిచూపి బెదిరించి గోడ దూకి పారిపోయాడు.

ఆగంతుకుడు ప్రవేశించిన ఉమెన్స్‌ హాస్టల్‌ ఇదే..
2014లో కూడా ఇలాగే  ఓ తాగుబోతు అర్ధరాత్రి లేడీస్‌ హాస్టల్‌లోకి ప్రవేశించి విద్యార్థినులను బెదిరించాడు. వారు అప్రమత్తమై అతన్ని పట్టుకునే లోపే వెనుకవైపు నుంచి గోడ దూకి పారిపోయాడు.
2015లో ఓ విద్యార్థిని లైబ్రరీలో చదువుకుని రాత్రి వేళ తిరిగి హాస్టల్‌కు వస్తుండగా, లా కళాశాల వద్ద ఇద్దరు వ్యక్తులు ఆమెపై దాడిచేశారు. ఆమె ప్రతిఘటించి తప్పించుకోగలిగింది. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థులు అక్కడకు వెళ్లేసరికి వారు పారిపోయారు.
ఇదే ఏడాది ఓ యువకుడు అర్ధరాత్రి హాస్టల్‌ గదిలోకి ప్రవేశించి దొంగతనానికి ప్రయత్నించగా అమ్మాయిలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయితే సదరు వ్యక్తి వారి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
2016లో ఓయూ క్యాంపస్‌లో నడుచుకుంటూ హాస్టల్‌కు వెళుతున్న ఇద్దరు  అమ్మాయిలపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడి వారి నుంచి సెల్‌ఫోన్లు, బ్యాగులు లాక్కునేందుకు ప్రయత్నించారు. యువతులు కేకలు వేయడంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు వచ్చేసరికి ఆగంతుకులు పారిపోయారు.
2016లో బయట నుంచి క్యాంపస్‌లోకి వచ్చిన ఓ ప్రేమజంటను జువాలజీ డిపార్టుమెంట్‌ వద్ద అడ్డుకుని పోలీసులమంటూ బెదిరించి వారినుంచి బంగారు ఆభరణాలు లాక్కున్నారు. దీనిపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. వారం రోజుల తర్వాత ఇదే గ్యాంగ్‌ రాత్రి వేళ ఐపీఈ వద్ద ఓ ప్రేమజంటను బెదిరించి వారినుంచి డబ్బులు లాక్కుని వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బెదిరింపులకు పాల్పడిన వారిలో ఒకరు పీజీ పూర్తి చేసిన నాన్‌బోర్డర్‌ కాగా, మిగతా ఇద్దరు వర్సిటీతో ఎలాంటిసంబంధం లేని వ్యక్తులు కావడం గమనార్హం.  

ఒక్కరినీ పట్టుకోలేదు..  
లేడీస్‌ హాస్టల్‌లో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగడం.. ఆగంతుకులు చొరబడ్డం జరుగుతోంది. విద్యార్థినులను భయబ్రాంతులకు గురిచేస్తున్నా ఈ సంఘటనలపై పాలనా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది లేదు. ఫిర్యాదులు చేసినా ఇంతరకు కనీసం ఒక్కరిని కూడా పట్టుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు.  

వెనుకవైపు లేని సీసీకెమెరాలు
విద్యార్థినుల రక్షణం కోసం హాస్టల్‌ చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అధికారులు కేవలం హాస్టళ్ల ముందు మాత్రమే బిగించారు. ముందు వైపు సీసీ కెమెరాలతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నందున దుండగులు హాస్టళ్ల వెనుక నుంచి గోడదూకి లోపలికి ప్రవేశిస్తున్నారు. జరిగిన సంఘటనలన్నీ అలాగే ఉన్నా అధికారులు మాత్రం హాస్టళ్ల వెనుక వైపు రక్షణ చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

దర్యాప్తు చేస్తున్నాం..
ఓయూ ఇంజినీరింగ్‌ లేడీస్‌ హాస్టల్‌లోకి వ్యక్తి ప్రవేశించాడనే సమాచారం రాగానే తనిఖీలు చేపట్టాం. క్లూస్‌టీమ్‌తో నమూనాలు సేకరించాం. అయితే, సీసీకెమెరాల్లో ఫుటేజ్‌ చూసినా ఫలితం కనిపించలేదు. ఆగంతుకుడు వెనుకవైపు నుంచి పారిపోయి ఉంటాడు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టాం. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటాం.    – రాజశేఖర్‌రెడ్డి, ఓయూ ఇన్‌స్పెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement