ఖమ్మం సిటీ : ఖమ్మం నగరపాలక సంస్థలో ఇష్టారాజ్య కొనసాగుతోంది. కార్పొరేషన్‌కు సంబంధం లేని ఓ అధికారి కాంట్రాక్ట్ సిబ్బంది విషయంలో అంతా తానై వ్యవహరిస్తున్నాడు. ఇతడిని నమ్ముకున్న 13 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ఇన్నాళ్లు ఆనందంగా గడిపినా ఇప్పుడు వారి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
అసలేం జరిగిందంటే...
ఖమ్మం మున్సిపాలటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందిన నేపథ్యంలో ఖానాపురం హవేలి గ్రామ పంచాయతీ ఇందులో విలీనమైంది. ఆ సమయంలో ఖానాపురం హవేలిలో పారిశుద్ధ్య పనులు నిర్వర్తించేందుకు అప్పటి గ్రామ పంచాయతీ మహాత్మగాంధీ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 231 మంది స్వీపర్లను నియమించింది.
అందులో కొంతమంది కార్మికులు తాము చాలాకాలంగా పని చేస్తున్నామని, తమను పర్మనెంట్ చేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఖానాపురం హవేలి కార్పొరేషన్‌లో విలీనం చెందిన తర్వాత కూడా వారినే కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయతీలో అప్పుడు ఉన్న అవసరాల దృష్ట్యా అధికారుల వారిలో కొంత మందిని వివిధ పనులకు ఉపయోగించుకున్నారు.
కార్పొరేషన్‌గా విలీనం చెందినప్పుడు సైతం స్వీపర్లుగానే ఉన్నా వారిలో కొందరు ఆ పనులు నిర్వర్తించలేదు. స్వీపర్ల పేరుతో కార్యాలయంలో కూర్చుని జీతాలు పొందారు. ఈ క్రమంలోనే హవేలిలో ఉన్న ఓ అధికారి డిప్యూటేషన్ మీద కార్పొరేషన్‌కు రావడంతో వారికి కలిసి వచ్చింది. ఇక్కడ సైతం పారిశుద్ధ్య పనులు చేయకుండా వివిధ విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో శానటరీ ఇన్‌స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి 231 మందిలో 13 మంది తన వద్ద పని చేయడం లేదని, వారికి తాను హాజరు వేయలేనని అప్పటి కమిషనర్ బి.శ్రీనివాస్‌కు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో 13 మందికి ప్రత్యేక స్వీపర్ల ప్యాకేజి ద్వారా జీతాలు ఇచ్చారు.
ఇందులో ఇద్దరు మినహా మిగిలిన వారెవ్వరూ కార్యాలయానికి హాజరైన దాఖలాలు లేవు. వారంతా హవేలి పంచాయతీ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారి సొంత పనులకు ఉపయోగపడ్డారు. ఇలా రెండేళ్లుగా కొనసాగినా ఆ అధికారిని అడిగే నాథుడే కరువయ్యాడు. అప్పటి కమిషనర్ అతడికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి ఆ అధికారి పనులు చేసినా చేయకపోయినా హాజరు వేయించి జీతాలు అందించారు.
ఈసారి కూడా వీరిని ప్రత్యేక ప్యాకేజీగా పిలిచేందుకు ఆయన ఫైల్ సిద్ధం చేశాడు. అయితే... కార్పొరేషన్ ను ఇటీవల తనిఖీ చేసిన కలెక్టర్ ఇలంబరితి నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జ్ కమిషనర్ వేణుమనోహర్‌ను ఆదేశించారు. దీంతో ఎంత మంది పని సిబ్బంది ఉన్నారు... ఎక్కడెక్కడ పని చేస్తున్నరని శానటరీ ఇన్‌స్పెక్టర్‌ను కమిషనర్ ఆరా తీశారు. 13 మంది సిబ్బంది స్వీపర్లుగా ఉండి కార్యాలయంలో పనులు ఎలా చేస్తున్నరని కింది స్థాయి అధికారులను ప్రశ్నించారు.
నిబంధనల ప్రకారం ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కార్యాలయంలో వినియోగించ కూడదని, వారిని తొలగించి కొత్తగా టెండర్లు పిలవాలని సూచించారు. దీంతో అధికారులు వారిని తొలగించి టెండర్లు పిలిచారు. ఈ క్రమంలో నవంబర్ 1 నుంచి కొత్త కాంట్రాక్ట్ అమల్లోకి వచ్చింది. ఈ 13 మంది పేర్లు లేకపోవడంతో వారిని కాంట్రాక్టర్లు విధుల్లోకి శనివారం నుంచి రావద్దని చెప్పారు.
పురపాలకంలో ‘పరాయి’ పాలన
Published Thu, Nov 6 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement