సాక్షి, హైదరాబాద్: పేద రోగులకు సేవ చేయాల్సిన ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ఇప్పుడు వారి నుంచే యూజర్ చార్జీల పేరుతో వసూళ్లు చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో కేన్సర్ చికిత్సకు రాష్ట్రంలోనే పేరెన్నికగన్న ఆసుపత్రి, ఇప్పుడు వైద్యానికి డబ్బులు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని పలువురు రోగులు గగ్గోలు పెడుతున్నారు. పైగా వివిధ పరీక్షలకు రసీదులు కూడా ఇవ్వడం గమనార్హం. మరోవైపు ఆరోగ్యశ్రీ రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాల్సి ఉండగా, వారిపై కూడా యూజర్ చార్జీల భారం వేస్తుండటం రోగులకు ఆవేదన కలిగిస్తోంది. ఆరోగ్యశ్రీ నుంచి డబ్బులు వచ్చాక తిరిగి రోగులకు చెల్లిస్తామంటూ ఆసుపత్రి అధికారులు చెబుతున్నారని రోగులు అంటున్నారు.
అలా ఇస్తామన్న హామీ ఎక్కడా లేదని, అక్రమాల కేంద్రంగా ఆసుపత్రి తయారైందని అంటున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకుడు శ్రీనివాసరెడ్డి వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రోగుల నుండి పరీక్షలకోసం యూజర్ చార్జీల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేస్తుండటాన్ని ఆయన అధికారులకు విన్నవించారు. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు వసూలు చేసినట్లుగా చూపుతున్న రసీదులు
రూ. 2,500 వరకు వసూలు
కొన్ని పరీక్షలకు రూ.100 నుంచి రూ. 1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి పరీక్షలకు రూ. 2 వేలు, రూ. 2,500 వసూలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులకైతే డబ్బు వసూలు చేయకూడదు. పూర్తి ఉచితంగా వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి భిన్నంగా ఫీజులు భారీగా వసూలు చేయడంపై రోగులు గగ్గోలు పెడుతున్నారు. యూజర్ చార్జీలు రద్దు చేయాలని తాము కోరగా, ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు రాగానే రోగులకు తిరిగి వెనక్కి ఇస్తున్నామని ఆసుపత్రి అర్‌ఎం చెప్పినట్లు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
తొలుత వసూలు చేయడమే తప్పు, పైగా తిరిగి చెల్లిస్తున్నామని చెప్పడం కూడా వాస్తవ విరుద్ధమని ఆయన ఆరోపించారు. పైగా రోగులు ఎవరికీ డబ్బు తిరిగి చెల్లిస్తున్న పరిస్థితి లేదు. అదీగాక యూజర్ చార్జీల బిల్లులు కంప్యూటరైజ్డ్‌వి కాకుండా చేతిరాతతో ఇస్తున్నారు. యూజర్ చార్జీల పేరుతో వసూలైన డబ్బు పూర్తిగా దుర్వినియోగమవుతున్నదని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశాఖ అధికారులతో కుమ్మక్కై ఆసుపత్రిలో కొందరు ఈ డబ్బును దిగమింగుతున్నారన్నారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ దందాపై విచారణ జరపాలని, అక్రమ వసూళ్ళను అరికట్టాలని ఆయన కోరారు.
ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో యూజర్ చార్జీలు
Published Wed, May 1 2019 3:22 AM | Last Updated on Wed, May 1 2019 3:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment