సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి తప్పించి ఖాదీబోర్డుకు అప్పగిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీనిచ్చారు. తెలంగాణ గౌడసంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావుగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన సభలో ఉత్తమ్ మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను అందిస్తామన్నారు.
గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఉన్నట్టుగా కల్లుగీత వృత్తిని ఎక్సైజ్ శాఖ నుంచి గ్రామీణ ఖాదీ బోర్డు పరిధిలోకి మారుస్తామన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు బడ్జెట్లలో సుమారు రూ.5 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. అయితే బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికలు సమీపించిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బీసీలపై కపటప్రేమ చూపిస్తున్నా రని విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోందని, సీఎం కుర్చీ నుంచి కేసీఆర్ దిగే సమయం కూడా వచ్చిందని, ఈ తరుణంలో బీసీ సబ్‌ప్లాన్ గురించి మాట్లాడుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.
జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి..
బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో 50 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ–ఈలో ఉన్న ముస్లింలకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, మిగిలిన బీసీ వర్గాల డిమాండును ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. బీసీల్లోని ఏబీసీడీ వర్గాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీనవర్గాలకు సీఎం కేసీఆర్ వ్యతిరేకి అని ఆయన ఆరోపించారు.
గీత కార్మికుల వృత్తి సమస్యలపై సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి సంపూర్ణ అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో గౌడ కులస్తులు, గీత కార్మికుల సమస్యలను పెడతామని, వాటి పరిష్కారానికి అధికారంలోకి వచ్చిన వెంటనే కృషిచేస్తామని హామీ ఇచ్చారు. గీత సహకార సంఘాలను ప్రోత్సహించడానికి వనాలను పెంచుతామని, వాటికోసం భూమిని కేటాయిస్తామని చెప్పారు. అలాగే లైసెన్సుల కాల పరిమితిని పెంచుతామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 10 ఎకరాల భూమిని, 20 వేల కోట్ల నిధులను కేటాయిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
గీత పారిశ్రామిక ఆర్థిక సంక్షేమ సంస్థకు నిధులు ఇవ్వకుండా, పాలకవర్గాన్ని నియమించకుండా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1,000 కోట్లు కేటాయించి, గీత కార్మికులకు ఆధునిక యంత్రాలను సమకూరుస్తామని అన్నారు. గౌడ విద్యార్థుల హాస్టల్ కోసం 10 ఎకరాలు కేటాయిస్తామన్నారు. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ లేదా హైదరాబాద్‌లో మరేదైనా ప్రసిద్ధమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తామన్నారు. కల్లుగీత కార్మికులకు రాజకీయంగా కూడా అవకాశాలను ఇస్తామన్నారు.
గౌడ కులస్తులు ఆదినుంచీ కాంగ్రెస్‌తోనే: షబ్బీర్ అలీ
శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ గౌడ కులస్తులు మొదటినుంచీ కాంగ్రెస్‌పార్టీతోనే ఉన్నారన్నారు. భవిష్యత్తులోనూ అలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ నేత మధు యాష్కీ మాట్లాడుతూ రాజకీయంగా తనకు అవకాశాలు ఇచ్చిన కాంగ్రెస్‌పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. దీనికోసం అంతా అంకితభావంతో పనిచేయాలన్నారు.
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గౌడ కులస్తులకు ఎంతోమందికి రాజకీయంగా అవకాశం కాంగ్రెస్ పార్టీతోనే వచ్చిందన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా కాంగ్రెస్‌పార్టీతో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు. పార్లమెంటు, శాసనసభకు పోటీచేయడానికి కాంగ్రెస్ పార్టీ ద్వారా అవకాశాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బండి నర్సాగౌడ్, బూడిద భిక్షమయ్యగౌడ్, రామారావుగౌడ్, ఇందిరా శోభన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment