
హడావుడిగా ఆఫీస్‌కు వెళ్తూ లంచ్ బాక్స్ మర్చిపోయారా? అత్యవసర పని నిమిత్తం బయటకు వెళ్తూ పత్రాలు మర్చిపోయారా? షాపింగ్ చేసిన వస్తువులు తీసుకెళ్లే వీలులేక మాల్స్‌లో ఉంచారా? ఇలా ఏదైనా సరే.. ఎప్పుడైనా సరే.. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తాము అందిస్తామంటోంది ‘వీ డెలివరీ’ టీమ్. దీనిని ప్రారంభించిన నగరవాసి శ్రీనివాస్ మాధవం చెప్పిన వివరాలు ఆయనమాటల్లోనే...
సాక్షి, సిటీబ్యూరో: నేను మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాను. ఐదేళ్లు చెన్నైలో జాబ్. ఉద్యోగ సమయంలో ఓ రోజు తీవ్ర జ్వరం వచ్చింది. మెడిసిన్ తీసుకురావడానికి ఎవరూ లేరు. ఫోన్‌లో ఆర్డర్ ఇస్తే కొందరు మందుల చీటి చూపించాలని కోరగా... మరికొందరు కనీసం రూ.500 బిల్ చేస్తేనే ఇంటికి డెలివరీ చేస్తామన్నారు. అప్పుడే నేను ఎదుర్కొన్న సమస్యే వీ డెలివర్ ఏర్పాటుకు దారితీసింది. తర్వాత రూ.60వేల జీతమచ్చే జాబ్ వదిలేసి, ఇంట్లో వాళ్లను ఒప్పించి 2014లో మాదాపూర్‌లో ఈ సంస్థను ప్రారంభించాను. ప్రతిరోజూ ఎన్నో పనులతో బిజీగా ఉండే సిటీజనులకు మా వంతు సహకారం అందించడమే మా సంస్థ లక్ష్యం. వెబ్‌సైట్:www.vdeliver.in
కనీస చార్జి రూ.30
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా... దుస్తులు, ఫుడ్, పండ్లు, మెడిసిన్స్, వస్తువులు, డాక్యుమెంట్స్... ఇలా లీగల్‌గా తీసుకెళ్లడానికి వీలుండే ఏవైనా మేం డెలివరీ చేస్తాం. 5 కిలోమీటర్ల నుంచి 8 కిలోమీటర్ల దూరానికి కనీస చార్జీగా రూ.30 వసూలు చేస్తున్నాం. ఆపై ప్రతి కిలోమీటర్‌కు రూ.10 చొప్పున చార్జీ ఉంటుంది. ఇందుకు మొత్తం 80 మంది టీమ్ పని చేస్తోంది. మీరు మా సేవలు వినియోగించుకోవాలనుకుంటే వీ డెలివర్ మొబైల్ యాప్‌లో గానీ, వెబ్‌సైట్‌లో గానీ ప్రొడక్ట్ వివరాలు, తీసుకోవాల్సిన ప్రదేశం, అందజేయాల్సిన ప్రదేశం తదితర వివరాలు ఇస్తే చాలు. వెంటనే మా ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేసి, డెలివరీ బాయ్‌ని మీ ఇంటికి పంపిస్తారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మా సేవలు వినియోగించుకోవచ్చు.
వయా వీ డెలివర్...
అంతే కాకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు.. డెలివరీ బాయ్ ఇంటికి వచ్చే సమయానికి ఆఫీస్‌లో ఉండడమో, పని మీద బయటకు వెళ్లడమో జరుగుతూ ఉంటుంది. దీనికి ‘వయా వీ డెలివర్’ ఒక పరిష్కారం. మీరు వీ డెలివర్ సైట్ నుంచే ‘వయా వీ డెలివర్’ ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన ప్రొడక్ట్‌ని ఎంపిక చేసుకుంటే... ఆ ప్రొడక్ట్ మాకు వస్తుంది. దాన్ని మా బాయ్స్ మీకు తీరిక సమయాల్లోనే, మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీరు చెప్పిన సమయానికే తీసుకొచ్చి అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment