
యాదగిరిగుట్ట (ఆలేరు): యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్–వరంగల్ హైవేపై యాదగిరిగుట్ట మండలం బాహుపేట స్టేజీ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఆటోను వజ్ర ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆటో వరంగల్ జిల్లా నుంచి ప్రయాణికులతో హైదరాబాద్ వైపునకు వెళుతుండగా.. వజ్ర ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి వరంగల్ వెళుతోంది.
మృతుల్లో కాప్రా మండలం బాలాజీనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ బర్మ రమేశ్ (35)తో పాటు అందులో ఉన్న శ్రీనివాస్(37), మరో ప్రయాణికుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ముగ్గురి వివరాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. గాయపడిన ఐదుగురిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటోలో వెళుతున్న వారంతా వరంగల్ జిల్లాలో జరిగిన ఓ పంచాయితీకి వెళ్లి వస్తున్నట్లుగా తెలిసిందని పోలీసులు చెబుతున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరగడంతో చాలా సేపు భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
విచారణకు ఆదేశించిన మంత్రి
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రమాదానికి కారణాలు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.