తూళ్ల వీరేందర్‌గౌడ్
సాక్షి, రంగారెడ్డి: టీడీపీ నేత, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ బీజేపీ గూటికి చేరడం ఖాయమైంది. ఈనెల 3న భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయం కండువా కప్పుకునేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. టీడీపీకి, ఆ పార్టీ పదవులకు వీరేందర్ సోమవారం రాజీనామా చేశారు. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి రాజీనామా లేఖను పంపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన తండ్రి టీడీపీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కూడా బీజేపీలోకి వెళ్తారని మొదట ప్రచారం జరిగినా వివిధ కారణాలతో ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరేందర్‌గౌడ్ ఒక్కరే టీడీపికి గుడ్ బై చెప్పడంతో కాషాయదళంలో చేరికపై స్పష్టత వచ్చింది. అంతేకాకుండా దేవేందర్ పెద్ద కుమారుడు, దేవేందర్ ఫౌండేషన్ ట్రస్టీ విజయేందర్ కూడా అదే రోజు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
బీజేవైఎం రాష్ట్ర బాధ్యతలు!
2014 ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన వీరేందర్.. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉప్పల్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగినా విజయతీరాలకు చేరుకోలేదు. ఆయన అప్పటి నుంచే పార్టీని వీడుతారనే సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను తన తండ్రితోపాటు ఢిల్లీలో కలిసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరిగినట్టు సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామనే హామీ తాజాగా ఇవ్వడంతో టీడీపీకి రాజీనామా చేసినట్లు వివిధ పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆయనకు బీజేవైఎం రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తామన్న భరోసా లభించినట్లు తెలిసింది. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో నగర శివారులోని అసెంబ్లీ నియోజవకవర్గం నుంచి అవకాశం కల్పించేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు అభిగ్న వర్గాల సమాచారం. తనతోపాటు టీడీపీ కార్యకర్తలు, అభిమానులను కూడా ఆ పార్టీలోకి తీసుకెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. నేడు, రేపు వారితో ప్రత్యేకంగా భేటీ అయి చర్చించనున్నారు.
సోదరుడికి మహేశ్వరంపై హామీ?
తన తండ్రి పేరిట స్థాపించిన ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు దేవేందర్‌గౌడ్ టీడీపీలోనే కొనసాగే అవకా శాలు కనిపిస్తున్నాయి. వయసు పైబడటం, అదేవిధంగా అనారోగ్యం తోడు కావ డంతో క్రియాశీల రాజకీయాలు నెరిపే పరిస్థితి కనిపించడం లేదు. పైగా 2008లో టీడీపీని వీడిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఈ పార్టీని.. సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. వివిధ కారణాలతో ఆ పార్టీకి కూడా గుడ్‌బై చెప్పి 2012లో తిరిగి తన మాతృపార్టీ అయిన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే రాజ్యసభ సభ్యుడిగా నియమితులైన ఆయన 2018 ఏప్రిల్ వరకు ఆ పదవిలో కొనసాగారు. ఈ పరిణామాలకు తోడు ఆరోగ్యం సహకరించకపోవడంతో మరో సారి పార్టీ మారడం వృథా అని దేవేందర్ భావించినట్లు తెలుస్తోంది. దేవేందర్ పెద్ద కుమారుడు విజయేందర్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే తన సోదరుడు వీరేందర్‌తో కలిసి ఆయన కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మహేశ్వరం అసెంబ్లీ టికెట్‌పై దృష్టిసారించినట్లు చర్చ జరుగుతోంది. దీంతో ఆ మేరకు పార్టీ అధిష్టానం నుంచి హామీ లభించిడంతో కాశాయం కండువా కప్పుకోనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment