ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్ : ప్రజా జీవితంలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల భాగస్వామ్యం అనేవి రాజకీయ నేతలు, అధికారులకు అత్యంత ముఖ్యమైన అంశాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. అవినీతి చీడను పారద్రోలి సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికి బాటలు వేయాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదేనని, సుపరిపాలన ద్వారా దేశ సమగ్ర, సుస్థిరాభివృద్ధికి కృషిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వమంటే ప్రజలకు కనిపించేది అధికారుల రూపంలోనేనని చెప్పారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో అఖిలభారత సర్వీసెస్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసు అధికారుల ఫౌండేషన్ కోర్సు ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సివిల్ సర్వెంట్స్‌కు ప్రజాసేవే పరమావధికావాలి. అనుక్షణం నీతి, నిజాయితీలతో పనిచేయాలి. ఏదో ఉద్యోగం చేస్తున్నాం అన్నట్టు కాకుండా ప్రజాసేవను ఒక బాధ్యతగా నిర్వహించండి’ అని అన్నారు.
పేదరికం, లింగవివక్షలపై...
దేశాన్ని పట్టిపీడిస్తున్నపేదరికం, నిరక్షరాస్యత, కుల, మత, లింగ వివక్షలను పారద్రోలడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో కనీస వసతుల కల్పన ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రధాని, ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి ఇలా కొందరి వల్లే దేశ పురోభివృద్ధి్ద సాధ్యం కాదని, అందరి భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమన్నారు. ప్రభుత్వపథకాలను అధికారులు సరిగ్గా అమలుచేయడంతోనే సుపరిపాలన సాధ్యమని తెలిపారు. ప్రస్తుతం అసహనం పెరిగిపోయిందని కొందరు అంటుంటారని, రాజకీయంగా ప్రజలిచ్చి న తీర్పు పట్ల సహనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ కాలంలో అనేక అవకాశాలు లభిస్తాయని, వాటితో పాటు సవాళ్లు కూడా ఉంటున్నందున వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండండి–ఫిట్‌గా ఉండండి..
నేటి యువత పిజ్జా, బర్గర్ వంటి పాశ్చాత్య రుచులకు ఆకర్షితులవుతోందని, ఆ ఆహారం విదేశీయులకు మంచిది తప్ప మనకు కాదని వెంకయ్యనాయుడు హితవుపలికారు. మనపెద్దలు నిర్దేశించినట్టుగా ఏ కాలానికి తగ్గట్టుగా ఆ సంప్రదాయ ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదన్నారు. ఇన్‌స్టంట్ ఫుడ్ తీసుకుంటే ఎల్లప్పుడూ (కన్‌స్టంట్)రోగాలు పొంచి ఉంటాయన్నారు. శారీరకంగా ధారుఢ్యంగా ఉండేందుకు వ్యాయామం, క్రీడలు దోహదం చేస్తాయని, ఫిట్‌నెస్ అనేది జీవితంలో భాగమని అధికారులు గుర్తించాలని చెప్పారు. తాను 70 ఏళ్ల వయసులోనూ ప్రతీరోజు బ్యాడ్మింటన్ ఆడతానని, ఉదయం ఢిల్లీలో బ్యాడ్మింటన్ ఆడి వచ్చానని తెలిపారు.
‘దేశ రక్షణ వ్యవస్థ, అనుబంధ రంగాల్లో మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వ్యవస్థ కీలకమైంది. ఈ విభాగం (ఎంఈఎస్) అధికారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశ రక్షణ వ్యవస్థలోభాగస్వాములయ్యే అవకాశం దొరుకుతుంది. ఈ వ్యవస్థలోనూ అవినీతికి తావులే కుండా..లక్ష్యాలను నిర్దేశిత సమయంలో పూర్తిచేయడంలో మీరు చొరవతీసుకోండి’ అని ఎంఈఎస్ అధికారులకు ఉపరాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ బీపీ ఆచార్య, కోర్స్ డైరెక్టర్ హర్‌ప్రీత్ సింగ్, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సీఈ బ్రిగేడియర్ పీకేజీ మిశ్రా పలువురు ఐఏఎస్ అధికారులు, ఫౌండేషన్ కోర్సుకు హాజరైన అఖిలభారత, కేంద్ర సర్వీసుల అధికారులు, మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసుల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment