
'తెలంగాణ పోలీసులకు సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధం'
హైదరాబాద్: సూర్యాపేట కాల్పుల ఘటన దిగ్బ్రాంతి కలిగించిందని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఐ, ఎస్ఐలను వెంకయ్యనాయుడు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్యనాయుడు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంకయ్యనాయుడు విలేకర్లతో మాట్లాడుతూ.. 72 గంటలు గడిస్తేకాని ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారన్నారు.
ధైర్యంగా పోరాడిన పోలీసులకు కేంద్రం తరఫున అభినందిస్తున్నట్లు తెలిపారు. శత్రువుల వద్ద ఆయుధాలున్నప్పటికీ పోలీసులు ధైర్యంగా పోరాడారన్నారు. తెలంగాణ పోలీసులకు ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా వెంకయ్య తెలిపారు. ఎన్ఐఏ సహకారం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి వెంకయ్యనాయుడు సూచించారు.