చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు.
నోడల్ అధికారులకు మంత్రి హరీశ్‌రావు సూచన
సాక్షి, హైదరాబాద్ : చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తి పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. అంచనాలు, పనుల్లో ఎలాంటి అవకతవకలు, లోపాలు లేకుండా చూడాల్సిన బాధ్యత నోడల్ అధికారుల దేనని స్పష్టం చేశారు. వారానికి 20 చెరువులు, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటనలు జరిపి పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. శనివారం ఆయన ఎర్రమంజిల్‌లోని జలసౌధలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. చెరువు పనుల నిర్వహణ, టెండర్ల ప్రక్రియ, సర్వే తదితర అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా శిఖం భూముల పట్టాలకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున వాటిపై రెవెన్యూ అధికారులతో కలసి సమాచారం సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్, నారాయణరెడ్డి, ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.
పునరుద్ధరణ ఆలస్యం?
చెరువుల పునరుద్ధరణ పనులు కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ మూడో వారంలో పనులు ప్రారంభించాలని ముందుగా నిర్ణయిం చినా, టెండర్ల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియకపోవడం, చాలా చెరువుల్లో నీరు సమృధ్ధిగా ఉండటంతో పూడికతీత సాధ్యంకాని దృష్ట్యా ఈ పనులను జనవరి మొదటివారం నుంచి ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.