క్షణం క్షణం.. భయం భయం
*చిరుత పులుల సంచారం
* పది గ్రామాల్లో బిక్కుబిక్కుమంటున్న జనం
*అటవీశాఖ అధికారులకు సవాలు
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని దాదాపు పది గ్రామాల ప్రజలను చిరుత పులుల భయం వెంటాడుతోంది. దాదాపు నెల రోజులుగా ఈ చిరుత పులుల సంచారం మండలంలో కలకలం రేపుతోంది. కలివేముల, చెర్లగూడెం, తోపుగొండ, జుల్కల్, కాశీపూర్ గ్రామాల శివారులోని అటవీ ప్రాంతాల్లో చిరుత పులితో పాటు రెండు చిరుత పిల్లల ఆనవాళ్లను అధికారులు కనుగొన్నారు. అవి సంచరిస్తున్న ఆనవాలు కూడా సీసీ కెమెరాల్లో కనిపించింది. చిరుత పులులను పట్టుకొనేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేసి తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ అవి చిక్కకుండా అటు అధికారులు, ఇటు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి.
పదిహేను రోజుల క్రితం మండలంలోని ఇంద్రకరణ్, చేర్యాల్ గ్రామ శివారులో కూడా పులులు సంచరించడాన్ని రైతులు ప్రత్యక్షంగా చూశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పై గ్రామాలను వదిలి ఈ రెండు గ్రామాల్లో పాదముద్రలను సేకరించారు. వాటిని బంధించడానికి ఇక్కడ కూడా రెండు సీసీ కెమెరాలు, రెండు బోనులు, ఎరగా మేకలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలో చిరుత పులి చిత్రాన్ని బంధించింది. మరో కెమెరాలో హైనాను పోలిన జంతువు చిక్కింది. కాగా అంతకుముందు లభించిన పులుల పాదముద్రలు, తాజాగా లభించిన సీసీ కెమెరాల్లో చిత్రాలను విశ్లేషించారు. పులులను బంధించడానికి అటవీశాఖ సిబ్బందిని అప్రమత్తం చేశారు.
పాదముద్రల సేకరణ
తాజాగా జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తాళ్లపల్లి గ్రామ శివారులో శుక్రవారం ఉదయం దండు ప్రభాకర్ అనే రైతుకు చిరుత కనిపించింది. భయకంపితుడైన రైతు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు అప్రమత్తమై దాన్ని పట్టుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చెరకు తోటలో పాద ముద్రలను సైతం సేకరించారు. చిరుత సంచరిస్తుందని నిర్ధారించారు.
సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. తాళ్లపల్లి గ్రామంతో పాటు ఫసల్‌వాది, కులబ్‌గూర్ గ్రామాల ప్రజలను సైతం అధికారులు అప్రమత్తం చేశారు. పులిని బంధించేందుకు ప్రస్తుతం ఇంద్రకరణ్ శివారులో ఉన్న రెండు బోన్లను కూడా తెప్పించి తాళ్లపల్లిలో ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇంద్రకరణ్ గ్రామస్తులు మరింత భయాందోళనకు గురవుతున్నారు.
అసలు ఎన్ని పులులు ఉన్నాయి.!
ఇదిలా ఉంటే సంగారెడ్డి మండలంలోని పది గ్రామాల శివార్లలో సంచరిస్తున్న చిరుత పులులు ఎన్ని ఉన్నాయి? కలివేముల, ఇంద్రకరణ్ తదితర గ్రామాల్లో కనిపించిన పులులే చెర్లగూడెం, తాళ్లపల్లి గ్రామ శివార్లకు వచ్చాయా? లేక వేరు వేరు పులులు సంచరిస్తున్నాయా? అన్న అనుమానం కల్గుతోంది. అసలు ఎన్ని పులులు సంచరిస్తున్నాయోనని ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఆయా గ్రామాల శివార్లలో సేకరించిన పులుల పాదముద్రలు వేర్వేరుగా ఉండడంతో పులుల సంచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రోజుకో గ్రామ శివారులో పులులు కనిపిస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పులులను బంధించి భయాందోళనలు తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.