సంగారెడ్డి అర్బన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఈ నెల 6, 11వ తేదీల్లో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్ ఓటర్లను కోరారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, జిల్లాలోని మారుమూల గ్రామాల ప్రజలకు రాజన్న పథకాలు చేరాయని వివరించారు.
ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలు లక్షలాది మందికి మేలు చేశాయన్నారు. రైతు ఆత్మహత్యలు పూర్తిస్థాయిలో తగ్గడానికి రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలే కారణమన్నారు. మహానేత పథకాలను యథాతథంగా ప్రజలకు మరోసారి అందించేందుకు వైఎస్సార్ సీపీ కృషి చేస్తుందన్నారు. తమ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలు కోరారు. కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.
అందోల్ మండలం నేరేడుగుంట ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి మొగులయ్యను కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ప్రచారం చేయకుండా అడ్డుకోవడం, లేనిపోని కేసులు పెడతామని బె దిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాలని కానీ ఇలా అడ్డుకోవడం సరికాదన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడే వారికి ఓటర్లు పట్టం కడతారని ప్రభుగౌడ్ స్పష్టం చేశారు. అరాచకాలకు పాల్పడే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఎంఆర్‌ఓ ఎల్లయ్య, యువజన సంఘం నాయకులు శివశంకర్ పాటిల్, అశోక్‌గౌడ్, జగదీష్, సురేష్, సుశాంత్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి
Published Sun, Apr 6 2014 1:24 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement