కొండంత విషాదం  | Warangal People Died In Godavari Boat Accident | Sakshi
Sakshi News home page

కొండంత విషాదం 

Published Mon, Sep 16 2019 7:11 AM | Last Updated on Mon, Sep 16 2019 7:11 AM

Warangal People Died In Godavari Boat Accident - Sakshi

బోటు ఎక్కే ముందు రాజమండ్రిలో కడిపికొండ వాసులు దిగిన ఫొటో

సాక్షి, కాజీపేట : వరంగల్‌ అర్బన్‌ జిల్లా కడిపికొండ.. ఈ గ్రామానికి చెందిన పలువురు ఆరోగ్యం కోసం వాకింగ్‌ చేయడం వారికి అలవాటుగా మార్చుకున్నారు. ఈ బృందంలో రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులతో పాటు చిరుద్యోగులు, చిన్న వ్యాపారాలు చేస్తున్న వారు, టీఆర్‌ఎస్‌ నాయకులతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. వాకింగ్‌ చేసే క్రమంలో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారింది. వయస్సు బేధాలు మరిచిపోయి మంచీచెడ్డా మాట్లాడుతూ గ్రామ సమస్యలపై చర్చించే వారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కూడా ఆనవాయితీ. ఇదేక్రమంలో ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ యాత్రే వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుందని వారికి తెలియదు.

గోదావరి జలాల్లో బోటుపై పయనిస్తూ ఆనందంగా గడపాలని భావించి పాపికొండలు చూడాలని బయలుదేరారు. కానీ వారి ప్రయాణం గమ్యాన్ని చేరలేదు. కడిపికొండ నుంచి 14 మంది విహారయాత్రకు వెళ్లగా.. అక్కడ తూర్పుగోదావరి జిల్లా తూర్పు దేవిపట్నం మండలం కచ్చలూరు సమీపంలో గోదావరి నదిలో బోట్‌ బోల్తా పడగా ఐదుగురే సురక్షితంగా బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది గల్లంతు కాగా, ఇద్దరు మృతదేహాలను వెలికితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కడిపికొండలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సురక్షితంగా బయటపడిన ఐదుగురు...

9 మంది గల్లంతు
గోదావరిలో బోటు మునిగిపోవడంతో కడిపికొండ నుంచి 14 మందిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా తొమ్మిది మాత్రం గల్లంతైనట్లు ఇక్కడకు సమాచారం అందింది. సురక్షితంగా బయటపడిన వారిలో బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, దర్శనాల సురేష్, గొర్రె ప్రభాకర్‌ ఉన్నారు.

ఆరు గంటల బోటు ప్రయాణం
సుమారు ఆరుగంటల పాటు కొనసాగే బోటు ప్రయాణంలో నాలుగు గంటల పాటు ఆహ్లాదంగా గడిచింది. ఇంతలోనే గోదావరి ఒక్క సారిగా ఉగ్రరూపం దాల్చింది, దీంతో కచ్చలూరు వద్ద బోటు నీట మునిగింది. ఆ సమయాన లైఫ్‌ జాకెట్లు ధరించిన ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాసింత ఏమరుపాటు.. ఇంకొద్ది జాప్యంతో లైఫ్‌ జాకెట్లు ధరించని 9 మంది గల్లంతయ్యారు. ఆరు గంటల విహార యాత్రలో నాలుగు గంటలు ముగియగా.. మరో రెండు గంటల మిగిలిన ఉండగానే ఆనందంగా గడుపుతున్న వారి ఆశలు ఆవిరయ్యాయి.

కుటుంబాల్లో అంతులేని ఆవేదన
సంతోషంగా పాపికొండలు విహారయాత్రకు వెళ్లగా బోటు మునిగిపోయిన ఘటనలో గల్లంతైన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అందరూ పేద కుటుంబాల వారే కావడం.. వారి కుటుంబీకులు, బంధువులు రోదనలు మిన్నంటాయి. గల్లంతైన వారిలో ఎక్కువ మంది రెక్కల కష్టం మీద బతుకుబండిని లాగుతున్న వారే ఉన్నారు. వీరంతా కుటుంబాలకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుండడంతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పెయింటర్లుగా, కూలీలుగా, భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పని చేస్తున్న వారు కూడా ఉంవడడం గమనార్హం.

భగవంతుడికి కోటి దండాలు
గోదావరి నదిలో బోటు బోల్తా పడి తమ వారు గల్లంతైనట్లు గెలియగానే బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ‘భగవంతుడా మావోళ్లు సురక్షితంగా బయటపడేలా చూడు’ అంటూ కోటి దండాలు పెడుతున్నారు. పరామర్శించేందుకు వచ్చిన వారిని సైతం వివరాలు అడుగుతున్నారు.

ఇద్దరు మృతి...
గోదావరిలో గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం అందింది. పెయింటర్‌గా జీవనం కొనసాగిస్తున్న బస్కే రాజేందర్‌(42), డిగ్రీ చదువుతున్న విద్యార్ధి బస్కే అవినాష్‌(21) మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికితీశాయని చెబుతున్నారు. ఈ విషయం తెలియగానే.. అంతసేపు తమ వారు సురక్షితంగా బయటపడుతారనే భావనతో ఉన్న కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

పది రోజుల క్రితమే ప్రణాళిక
పాపికొండలు టూర్‌కు వెళ్లాలని కడిపికొండ వాసులు పది రోజుల క్రితమే నిర్ణయించుకున్నారు. అయితే, ఆ సమయంలో గోదావరిలో వరద ఉధృతి ఎక్కువగా ఉందని పత్రికలు, ఛానళ్ల ద్వారా తెలియడంతో వెనుకడుగు వేశారు. ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయనే సమాచారం అందడంతో బయలుదేరిన వారు ప్రమాదంలో చిక్కుకున్నారు.

ఘటనా స్థలానికి మంత్రి, ఎమ్మెల్యే
గోదావరిలో బోల్తా పడిన ఘటనలో గల్లంతైన వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఘటనా స్థలానికి బయలుదేరారు. అలాగే, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ కూడా వెళ్లారు.

విహారయాత్రకు 14 మంది...
కడిపికొండ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు, ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు, విద్యార్థులు కలిపి వాకింగ్‌ చేస్తుంటారు. వీరిలో ఎస్సీలైన పలువురు మాదిగ మహరాజ కుల సంక్షేమ సంఘంగా ఏర్పడ్డారు. ఇందులో నుంచి 14 మంది పాపికొండలు చూడాలని గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో కాజీపేట నుంచి బయలుదేరారు. శుక్రవారం రాత్రి బయలుదేరిన వారు శనివారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు.

అక్కడ స్థానికంగా గోదావరి బ్రిడ్జి, కాటన్‌ మ్యూజియం ఇతరత్రా సందర్శనీయ ప్రదేశాలు చూడాక బస చేశారు. ఆదివారం ఉదయం బోటులో పాపికొండలు సందర్శనకు బయలుదేరారు. పాపికొండలు చూస్తూ భద్రాచలం వెళ్లి రామయ్యను దర్శించుకోవాలనేది ప్రణాళిక. అయితే, మధ్యలోనే బోటు మునిగిపోవడం గమనార్హం.

కాపాడిన లైఫ్‌ జాకెట్లు
కడిపికొండ వాసుల్లో ఐదుగురు సురక్షితంగా బయటపడడానికి లైఫ్‌ జాకెట్లే కారణమయ్యాయి. బోట్‌ ఎక్కగానే లాంచీ నిర్వాహకులు ఇచ్చిన లైఫ్‌ జాకెట్లను వెంటనే బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, దర్శనాల సురేష్, గొర్రె ప్రభాకర్, అరెపల్లి యాదగిరి ధరించారు. మిగతా తొమ్మిది మంది కొంత ఆలస్యం.. కొంత ఏమరుపాటు కారణంగా లైఫ్‌ జాకెట్లు ధరించలేదు. ఇంతలోనే గోదావరిలో బోట్‌ కుదుపునకు గురై బోల్తా పడడం గమనార్హం.

నిర్వాహకులు ఇచ్చిన వెంటనే లైఫ్‌ జాకెట్లు ధరించి ఉంటే ఈ తొమ్మిది మంది కూడా సురక్షితంగా బయలపడేవారని చెబుతున్నారు. కాగా, లైఫ్‌ జాకెట్లు ధరించిన వారు బోట్‌ బోల్తా పడగానే నీటిపై తేలియాడుతూ గంటసేపటి వరకు నదిలో ఈత కొడుతూ ముందుకు సాగాక మరో లాంచీలో వచ్చినవారు కాపాడినట్లు తెలుస్తోంది.

టీవీలకు అతుక్కుపోయిన కుటుంబ సభ్యులు
బోటు బోల్తా పడిందని తెలియగానే కడిపికొండలోని 14 మంది కుటుంబాల వారు టీవీలకు అతుక్కుపోయారు. ఎవరెవరు గల్లంతయ్యారు, ఎవరెవరు సురక్షితంగా బయటపడ్డారని తెలుసుకున్నారు. గల్లంతైన వారి పేర్లు ప్రకటించటగానే వారి కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక గ్రామంలోని యువత ఎప్పటికప్పుడు సెల్‌ఫోన్ల ద్వారా సమాచారాన్ని సేకరిస్తూ కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement