
వాటర్‌గ్రిడ్: ఇంటింటికీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టారు. దాదాపు రూ.40 వేల కోట్ల అంచనాతో నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.26 లక్షల కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్లు నిర్మించనున్నారు. మొత్తంగా 25 వేల జనావాసాలకు 56 నీటిశుద్ధి ప్లాంట్ల ద్వా రా 39 టీఎంసీల తాగునీటిని సరఫరా చేస్తారు. సగటున ప్రతి వ్యక్తికి గ్రామాల్లో వంద లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కరీంనగర్ జిల్లాలోని మానేరు డ్యామ్ నుంచి తన నియోజకవర్గమైన సిద్ధిపేటకు నీటిని తరలించిన తరహాలోనే.. ఈ పథకానికి స్వయంగా ఆయనే రూపకల్పన చేయడం గమనార్హం. దీనిపై మంత్రులను సిద్ధిపేట ప్రాజెక్టు వద్దకు తీసుకెళ్లిన కేసీఆర్.. వారికి స్వయంగా తానే అవగాహన కల్పించారు కూడా. ఈ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలిక్ పనులు, బావుల నిర్మాణం, విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు వంటి వాటికి అన్ని ప్రభుత్వ శాఖలు ఒకేసారి అనుమతులు ఇచ్చేలా కేసీఆర్ ఆదేశించారు.