
సచివాలయ సందర్శకులకు తాగునీటి ఇక్కట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయానికి వెళ్తున్నారా? అయితే తాగడానికి సరిపడా మంచి నీటిని పట్టుకెళ్లండి. ఎందుకంటే అక్కడ ప్రధాన గేటు నుంచి మొదలుకుని మంత్రుల పేషీల వరకు ఎక్కడా తాగునీటి సౌకర్యం లేదు. ప్రతి రోజూ రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది రాజధానిలోని సచివాలయానికి వస్తుంటారు. అలా వచ్చిన వారికి దాహం తీర్చుకోవడానికి ఎక్కడా నీటి సదుపాయం లేదు.
గుక్కెడు నీళ్లు తాగడానికి ఏదైనా విభాగానికి వెళ్లి అడిగి మరీ దాహం తీర్చుకోవాలి. గతంలో డీ బ్లాక్ పార్కింగ్ స్థలంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసినా, అది పని చేయడం మానేసి ఏళ్లు గడుస్తోంది. మంత్రులు, అధికారుల పేషీల ముందు కూడా వాటర్ డిస్పెన్సర్‌లు లేవు. ఎండాకాలం సమీపిస్తున్నందున ఇప్పటికైనా తాగునీటి సదుపాయం కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు.