
వా'ట'ర్
రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.. చెంతనే నీళ్లున్నా దాహం తీర్చుకోలేని, పొలాలకు పారించుకోలేని ....
► కడుపు ఎండి.. గుండె మండి
► కోయిల్‌సాగర్ నీళ్లు వదిలిన రైతులు
► ఎడమకాల్వల చట్రం ధ్వంసం
► రైతులతో చర్చించిన డీఎస్పీ, ఆర్డీఓ
► మనుషులకే కాదు..పశువుల గొంతులు తడవని పరిస్థితి
► కోయిల్‌సాగర్ నుంచి కాలువలకు రైతులే నీటి విడుదల
► కోయిల్‌సాగర్‌ను ముట్టడించిన మూడు మండలాల రైతులు, ప్రజలు
తాగునీటి కోసం కోయిల్‌సాగర్ నుంచి కాలువలకు నీటిని వదలాలని కోరుతూ దేవరకద్ర నియోజకవర్గంలోని మూడు మండలాల రైతులు, ప్రజలు శుక్రవారం ప్రాజెక్టు గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. నీటిని విడుదల విషయమై సిబ్బందితో మాట్లాడారు. తామేమీ చేయలేమని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహంతో తూముగేట్లను పైకి లేపారు. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేశారు.మూడున్నర గంటలపాటు కాల్వల వద్దకాపలాగా ఉండి వంటావార్పు చేశారు.
దేవరకద్ర: రైతుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది.. చెంతనే నీళ్లున్నా దాహం తీర్చుకోలేని, పొలాలకు పారించుకోలేని పరిస్థితిని చూసి వారి కడుపుమండింది. కలెక్టర్ సైతం తమ వినతి వినిపించుకోలేని దైన్యం చూసి ఆవేశం దహించుకుపోయింది.. తాగు, సాగునీటి కోసం కోయిల్‌సాగర్ నీటిని విడుదల చేయాలని నాలుగురోజుల క్రితం కలెక్టర్‌కు విన్నవించినా ఆమె పట్టించుకోకపోవడంతో శుక్రవారం దేవరకద్ర, ధన్వాడ, చిన్నచింతకుంట మండలాల రైతులు వేలాదిగా వచ్చి తూములు తెరిచి నీటిని దిగువకు వదిలారు. అయితే ఉదయం మూడు మండలాలకు చెందిన రైతులు కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గె స్ట్‌హౌస్ వద్దకు చేరుకుని నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
స్థానిక సిబ్బంది అధికారుల అనుమతిలేకుండా నీటివిడుదల సాధ్యం కాదని తేల్చిచెప్పడంతో కోపోద్రిక్తులైన రైతులు కోయిల్‌సాగర్ ఎడమకాల్వ హ్యాండిల్‌తో పాటు షట్టర్‌ను ధ్వంసం చేశారు. దీంతో నీరంతా కాల్వద్వారా పరవళ్లు తొక్కింది. అనంతరం ధన్వాడ వైపు ఉన్న కుడికాల్వ హ్యాండిల్‌ను తిప్పి నీటిని వదిలారు. రెండుకాల్వల ద్వారా నీరు విడుదల చేసిన రైతులు సమీపంలోనే చెట్లకింద వంటావార్పు చేసుకుని అక్కడే ఉండిపోయారు. అధికారులు వచ్చి నీటిని నిలిపేస్తారేమోనని భావించిన రైతులు కాపలా ఉన్నారు. ఇలా మూడున్నర గంటల పాటు కాల్వల్లో నీరు ఉధృతంగా ప్రవహించింది.
పర్యవేక్షించిన ఆర్డీఓ, డీఎస్పీ
విషయం తెలుసుకున్న నారాయణపేట ఆర్డీఓ వేణుగోపాల్, గద్వాల డీఎస్పీ బాలకోటి అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. అప్పటికే దేవరకద్ర, ధన్వాడ పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడి వచ్చారు. నీటిని విడుదల చేయడం చట్టరీత్యా నేరమవుతుందని రైతలను సముదాయించారు. కలెక్టర్‌తో మరోసారి చర్చిద్దామని రైతులకు నచ్చచెప్పారు. రైతులు దిగిరాకపోవడంతో ప్రాజెక్టు చైర్మన్ ఉమామహేశ్వర్‌రెడ్డితో పాటు రైతునాయకులతో చర్చించారు. చివరకు నీటి విడుదలను నిలిపివేసేందుకు రైతులు అంగీకరించడంతో అధికారులు మొదట కుడికాల్వ నీటిని నిలిపేశారు. ఎడమకాల్వలను కొద్దిసేపటి తరువాత మూసివేశారు.
కోయిల్‌సాగర్ నీళ్లను వదులుకోవద్దు
జూరాల: జూలై చివరి వరకు మహబూబ్‌నగర్ పట్టణ తాగునీటి అవసరాలకు కోయిల్‌సాగర్ రిజర్వాయర్ నుంచి నీటిని అందించాల్సి ఉన్నందున, ఎవరూ పంటలకు విడుదల చేసుకోవడానికి ప్రయత్నించకూడదని జిల్లా ప్రాజెక్టుల సీఈ ఖగేందర్ కోరారు. మహబూబ్‌నగర్ పట్టణ తాగునీటి అవసరాలకు(జూలై చివరి వరకు) 200 ఎంసీఎఫ్‌టీ ఉందని, ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా వివిధ గ్రామాలకు 40 ఎంసీఎఫ్‌టీ నీళ్లు అందించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం కోయిల్‌సాగర్‌లో కేవలం 240ఎంసీఎఫ్‌టీ నీటినిల్వ మాత్రమే ఉందని, అందులో 50ఎంసీఎఫ్‌టీల నీళ్లు ఆవిరి అవుతాయన్నారు. మొత్తం 290 ఎంసీఎఫ్‌టీ నీళ్లు తాగునీటికి అవసరం కాగా 50 ఎంసీఎఫ్‌టీల కొరత ఇప్పటికే ఉందన్నారు. వేసవిలో వర్షాలు కురవకపోతే తాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయన్న విషయాన్ని గమనించాలని ప్రాజెక్టుల సీఈ ఖగేందర్ కోరారు.
కలెక్టరేట్‌లో రెండుగంటల హైడ్రామా!
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం రెండుగంటల పాటు హైడ్రామా కొనసాగింది. కోయిల్‌సాగర్ వద్ద తాగునీటి కోసం ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేకవాహనాల్లో కలెక్టరేట్‌కు తీసుకొచ్చారు. కలెక్టర్ అప్పటికే వీడియో కాన్ఫరెన్స్ ముగించుకుని వెళ్లిపోయారు. మహబూబ్‌నగర్ డీఎస్పీ కృష్ణమూర్తి కలెక్టరేట్‌లో పోలీసులు మోహరించారు. రైతుల నుంచి విషయం తెలుసుకున్న ఆయన ఫోన్‌లో కలెక్టర్‌కు వివరించారు. జాయింట్ కలెక్టర్ రాంకిషన్ వస్తారని డిఎస్పీ వారికి సూచించారు. కలెక్టరేట్‌లో రెండుగంటల పాటు నిరీక్షించిన రైతులు డీఆర్వోకు విషయాన్ని వివరించి జేసీ రాంకిషన్ రాక విషయంపై స్పష్టత తీసుకున్నారు. ఆయన పెళ్లిలో ఉన్నారని, శనివారం ఉదయం 10గంటలకు రావాలని సూచించారు. విషయం తెలుసుకున్న రైతులు చివరికి నిరాశతో వెనుదిరిగారు.