♦ ఎంటెక్ కోర్సుల కొనసాగింపుపై ఇంజినీరింగ్ కళాశాలల వెనకడుగు
♦ స్వచ్ఛందంగా వద్దనుకుంటున్న యాజమాన్యాలు
♦ నిర్వహణ భారం, అధికారుల తనిఖీలే కారణం
హైదరాబాద్ : సరైన సౌకర్యాలు, అర్హులైన అధ్యాపకులు లేని ఇంజినీరింగ్ కళాశాలలపై ఓయూ అధికారులు సైతం కొరడా ఝళిపిస్తున్నారు. ఇప్పటివరకు జేఎన్‌టీయూహెచ్ వర్సిటీ నిజ నిర్ధారణ సంఘం తమ పరిధిలోని కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తూ వచ్చింది. అంతేగాక ఏఐసీటీఈ నిబంధనలకు అనుగుణంగాలేని కళాశాలలకు అనుబంధ గుర్తింపు నిరాకరించిన విషయం తెలిసిందే. తాజాగా త మ పరిధిలోని ఇంజినీరింగ్, పీజీ, వృత్తివిద్యా కళాశాలల్లో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బ్యాచిలర్ ఇంజినీరింగ్‌కు సంబంధించి మౌలిక సౌకర్యాలు, ఫ్యాకల్టీ ఆయా కళాశాలల్లో సరిపడా ఉన్నా.. ఎంటెక్ విషయానికొచ్చే సరికి యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి.
ముఖ్యంగా ఫ్రొఫెసర్ల నియామకంలో వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఒక్కో ప్రొఫెసర్ నెలకు రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని కళాశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. ట్యూషన్ ఫీజులు తక్కువ మొత్తంలో ఉండడం, మరోపక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ప్రభుత్వ చెల్లింపులు ఆ స్థాయిలో లేకపోవడం, ఇచ్చే అత్తెసరు రీయింబర్స్‌మెంట్ కూడా సకాలంలో రాకపోవడంతో కళాశాలలపై పెను ఆర్థిక భారం పడుతోంది. మరోపక్క ఏఐసీటీఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని వర్సిటీ అధికారులు ఖరాకండిగా చెబుతుండడంతో కళాశాలలు తీవ్ర ఆందోళనలో పడ్డాయి.
ఈ నేపథ్యంలో ఎంటెక్ నిర్వహణతో ఏటేటా ఆర్థికభారం రెట్టింపవడంతో ఆలోచనలో పడ్డాయి. మరోదారి లేక నాలుగైదు కళాశాలలు ఈ విద్యా సంవత్సరానికి ఎంటెక్ కోర్సు కొనసాగించలేమని వర్సిటీ అధికారులకు తేల్చిచెప్పినట్లు సమాచారం. ఉన్న మౌలిక వసతులు, ఫ్యాకల్టీ మేరకే బ్రాంచ్‌లు నడపాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఇంకొన్ని కళాశాలలు పలు బ్రాంచ్‌లు రద్దు చేసుకుంటున్నట్లు సమచారం. వాస్తవంగా ఓయూ పరిధిలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలు పది మాత్రమే. వీటితోపాటు జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని కళాశాలల్లోనూ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో భారీగానే సీట్లల కోత పడిందని సమాచారం. దీంతో ఈ ఏడాది ప్రవేశాలకు ఎదురుచూసే విద్యార్థుల్లో చాలామందికి నిరాశ తప్పదు.
పీజీ కళాశాలల్లోనూ..
మరోపక్క ఎంబీఏ, ఎంఫార్మసీ, పీజీ క ళాశాలలపై కూడా వర్సిటీ అధికారులు దృష్టి సారించారు. ఓయూ పరిధిలో ఎంబీఏ 140, ఫార్మసీ 15, పీజీ కళాశాలలు 75 ఉన్నాయి. ఈ కళాశాలలన్నింటిలో ఇటీవల ముమ్మరంగా అధికారుల తనిఖీలు ముగిశాయి.
యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, మౌలిక సౌకర్యాలు, లైబ్రరీ, నాన్ టీచింగ్ స్టాఫ్ లేని పదుల సంఖ్యలో కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లో లోపాలు సవరించుకోవాలని యాజమాన్యాలకు గడువిచ్చారు.
గతేడాది నిబంధనలు పాటించని పలు కళాశాలల్లో సీట్ల కోత పెట్టిన ట్లు అధికారులు తెలిపారు. అన్ని కళాశాలల్లో కలిపి మూడు వేల సీట్ల వరకు క త్తిరించామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చాలా కళాశాలలు వసతుల కల్పనలో మెరుగుపడ్డాయి. మరికొన్ని రోజుల్లో గడువు ముగియనుందని, ఈలోగా ఫ్యాకల్టీ నియామకాలు, వసతుల కల్పన దాదాపు అన్ని కళాశాల్లో జరగనుందన్న ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
మాకొద్దీ ‘టెక్’..
Published Mon, Jul 6 2015 1:30 AM | Last Updated on Tue, Jul 31 2018 4:52 PM
Advertisement
Advertisement