
చీర్యాల దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తాం
- శ్రీ లక్ష్మీనృసింహస్వామికి పట్టువస్త్రాలు
- సమర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్
కీసర: చీర్యాల శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని అభివృద్ధిపర్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల లక్ష్మీనృసింహస్వామి సప్తమ వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవానికి ఆయన హాజరై పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయనకు దేవస్థానం వేద పండితులు స్వామివారి ఆశీర్వచనం, మహాప్రసాదాన్ని అందజేశారు. భక్తుల సౌకర్యార్థం రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన 42 గదుల వసతి గృహాన్ని, చీర్యాల చౌరస్తాలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన స్వాగత ద్వారాన్ని సీఎం ప్రారంభించారు.
చీర్యాల దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేవస్థానానికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ రఘునందన్‌రావుకు సీఎం ఆదేశించారు. సీఎం వెంట మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మలిపెద్ది సుధీర్‌రెడ్డి, బాబూమోహన్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తదితరులున్నారు.