టీవీ9పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే | we will take action against tv9 | Sakshi
Sakshi News home page

టీవీ9పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే

Published Sun, Jun 15 2014 1:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

టీవీ9పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే - Sakshi

టీవీ9పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే

ఉభయ సభల ఏకగ్రీవ తీర్మానం
 
 సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యుల గౌరవాన్ని, సభ ఔన్నత్యాన్ని కించపరిచేలా కథనాన్ని ప్రసారం చేసిన టీవీ 9పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉభయ సభలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయంలో ఉభయ సభల అధిపతులకు అధికారాలను కట్టబెట్టాయి. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తొలుత శాసనసభలో, ఆ తరువాత శాసన మండలిలో ఈ మేరకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
 
 ‘‘తెలంగాణ శాసనసభను, సభాపతిని, సభ్యులను కించ పరుస్తూ అవమానకర రీతిలో ప్రసారాలు చేసిన టీవీ9 అనే వార్తా సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సభ కోరుతోంది. స్పీకర్‌కు, చైర్మన్‌కు అధికారాన్ని కట్టబెడుతూ ఏకగ్రీవంగా తీర్మానించింది’ అని పేర్కొన్నారు. ఆ వెంటనే ఉభయ సభల అధిపతులు వీటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. అంతకుముందు ఇదే అంశంపై అసెంబ్లీ కమిటీ హాలులో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, పలువురు సభ్యులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీవీ 9 ప్రసారం చేసిన కథనాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. ఈ దృశ్యాలను చూసిన సభ్యులంతా ఆగ్రహానికి లోనయ్యారు. టీవీ 9 చానల్ తీరును ముక్తకంఠంతో ఖండించారు. విశ్వసనీయ సమాచారం మేరకు... వుుందుగా కేసీఆర్ వూట్లాడుతూ ‘‘ఈ చానల్ దృష్టిలో తెలంగాణ వాళ్లంటే తెలివి లేనోళ్లు.. పనికిమాలినోళ్లు... పాలించడం కూడా చేతకాదు. మళ్లీ సమైక్య పాలన రావాలనే రీతిలో ప్రసారం చేశారు. ల్యాప్‌టాప్ ఇస్తే మడిచి యాడ పెట్టుకుంటారంటూ అవమానించారు.

 

టీవీ9 ప్రసారాన్ని చూసినాక నేను తీవ్ర ఆగ్ర హోదగ్రుడినయ్యాను. మీరు కూడా చూడాలనే ఉద్దేశంతోనే వీడియో క్లిప్పింగులను మీ ముందుకు పెట్టాను. అలాంటి చానల్‌పై ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుందో మీరే నిర్ణయించండి’’ అని సూచించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవించిన విపక్ష సభ్యులంతా టీవీ9పై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. శాసనసభను, సభ్యులను అవమానించడమంటే తెలంగాణలోని 4 కోట్ల ప్రజలను కించపరిచినట్లేనని పేర్కొన్నారు.
 
 అత్యంత కఠినంగా శిక్షించాల్సిందే: కాంగ్రెస్
 
 కాంగ్రెస్ తరపున తొలుత డీకే అరుణ మాట్లాడుతూ... టీవీ9పై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని, అదే సమయంలో శాసనసభ్యులను కించపరుస్తూ మామామియా, తీన్‌మార్, మాటకారి మంగ్లీ పేరుతో వ్యంగ్య కార్యక్రమాలు ప్రసారాలు చేస్తున్న టీవీ చానళ్లనూ నియంత్రించాలని కోరారు. గీతారెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ విషయంలో చూపుతున్న తెగువను కొనియాడారు. కేసీఆర్ మాత్రమే ధైర్యంగా మీడియాపై కఠిన చర్యలు తీసుకోగలరని అభిప్రాయపడ్డారు. సభా నిబంధనల ప్రకారం టీవీ 9 యాజమాన్యాన్ని జైలుకు పంపాల్సిందేనని, తద్వారా చట్టసభలను కించపర్చే మీడియాకు కూడా ఇదో హెచ్చరికలా ఉంటుందని యాదవరెడ్డి ప్రతిపాదించారు. ఈ విషయంలో అందరం కలిసి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. చివర్లో డీఎస్ మాట్లాడుతూ.. ‘న్యాయపరంగా ఉన్న అవకాశాలు, సభా నిబంధనలకు లోబడి టీవీ9పై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. డీఎస్ వాదనతో తానూ ఏకీభవిస్తున్నట్లు జానారెడ్డి చెప్పారు. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ సభ్యులు సైతం శాసనసభ వ్యవస్థను కించపరిస్తే సహించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు.
 
 ఇంతటితో వదిలేద్దాం: తెలుగుదేశం
 
 టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి మాత్రం అధికార, విపక్షాలతో విభేదించారు. ‘‘టీవీ 9 ఇప్పటికే జరిగిన దానిపై బహిరంగ క్షమాపణ చెప్పినందున ఇంతటితో వదిలేద్దాం. ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. అయినా టీవీ 9 ఒక్కదాన్నే దోషిగా చిత్రీకరించడం సరికాదు. టీ న్యూస్, సాక్షి టీవీ సహా పలు చానళ్లు శాసనసభ్యులను కించపర్చేలా కథనాలు ప్రసారం చేస్తున్నాయి’’ అన్నారు. అయితే మిగిలిన సభ్యులంతా రేవంత్ వ్యాఖ్యలతో విభేదించారు. వ్యక్తులపై చేసే వ్యాఖ్యలకు, దీనికి ముడిపెట్టొద్దని సూచించారు. మజ్లిస్ సభ్యుడు ఖాద్రీ మాత్రం టీవీ9 చానల్ క్షమాపణ చెప్పినందున ఈ ఒక్కసారికి హెచ్చరించి వదిలేద్దామని సూచించారు.
 
 టీవీ9కి టీడీపీ వకాల్తా..


 నష్ట నివారణ కోసం టీవీ9 రెండ్రోజులుగా ప్రయుత్నిస్తోంది. చానల్ ప్రతినిధుల ద్వారా మంత్రులను కలిసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ప్రాధేయపడింది. శుక్రవారం సాయంత్రం టీవీ9 ప్రతినిధులిద్దరు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులను వేర్వేరుగా కలిసినట్లు తెలిసింది. ‘‘జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పాం. బాధ్యులైన ఉద్యోగులను తొలగించాం. ఈసారికి వదిలేయండి. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం’’ అని వేడుకున్నారు. అయితే మంత్రులు మాత్రం... ‘శాసనసభ ఔన్నత్యాన్ని, దళిత ఎమ్మెల్యే గౌరవాన్ని దెబ్బతిసేలా మీ టీవీ ప్రసారం చేసినకథనం పట్ల సీఎం చాలా ఆగ్రహంగా ఉన్నారు. మేమేమీ చేయలేం’ అని నిస్సహాయత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయా ప్రతినిధులు టీడీపీ సభ్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్యను కలిసి టీవీ9 యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. అందులో భాగంగా ఇతర టీవీ చానళ్లు శాసససభ్యులను కించపరుస్తూ ఇటీవల కాలంలో చేసిన ప్రసారాల క్లిప్పింగులను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సమావేశంలో టీడీపీ సభ్యులు టీవీ9కి మద్దతుగా నిలిచినప్పటికీ అధికార, విపక్షాలన్నీ ఒకే మాటపై నిలబడటంతో చేసేదేమీలేక మిన్నకుండిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement