‘పెళ్లి చేసుకున్న పెనిమిటి మధ్యలోనే ముంచిండు..కుటుంబాలను ఆదుకునే దిక్కులేదు. ఓవైపు చిన్నారి పిల్లలు.. మరోవైపు ముసలి తల్లిదండ్రులు. వారిని ఎలా బతికించుకోవాలో తెలియక తప్పనిస్థితిలో మురికికూపంలోకి దిగారు. నాటి నుంచి వారికన్నీ కష్టాలే. కన్నీటిని దిగమింగి ఒళ్లమ్ముకుని సంపాదించిన సొమ్మును రౌడీలు, పోలీసులు గద్దల్లా తన్నుకుపోతున్నారు. బేరమాడుకున్న విటులు తమ శరీరంపై గాయాలు చేస్తున్నారు. పంటి బిగువన బాధను దిగమింగి సుఖాన్ని అందిస్తున్నాం.
వారు కర్కశుల్లా మారి ఆభరణాలు దోచుకొని హత్యలకు తెగబడుతున్నారు. పోలీసులవద్దకు వెళ్తే వారినుంచి కూడా సూటిపోటి మాటలు తప్పడం లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పాడు వృత్తినుంచి బయటపడాలనుకుంటున్నాం. కానీ, మా బాధ వినేవారేరీ.. మీకేం.. రోజూ బాగానే సంపాదిస్తున్నారుగా!’ అంటూ సూటిపోటి మాటలు తప్ప జాలి చూపే వారేలేరు. ఇదీ.. పడుపు వృత్తిలో మగ్గుతున్న మహిళల జీవన‘బాధ’..!
జడ్చర్ల టౌన్: ‘‘ నా భర్త చనిపోయిండు. అమ్మానాన్న లేరు. ముగ్గురు తమ్ముళ్లకు నేనే జీవనాధరం. పిల్లలను ఓ ఆశ్రమంలో చేర్పించిన. ఏ పనిచేసినా ఇంట్లో గడడం లేదు. నా స్నేహితురాలితో కలిసి ఈ పనిలోకి వచ్చిన. రోజుకు రూ.200 రూ.500 వరకు సంపాదిస్తుంటా. ఒక్కోరోజు ఒక్కరూపాయి కూడా దొరకదు. వచ్చిన నానా ఇబ్బందులకు గురిచేస్తరు. అయినా ఓర్చుకుంటున్నం.. వేశ్యవృత్తి చేయాలని లేకపోయినా నా పిల్లల బతుకుదెరువు కోసమైనా ఈ పనిచేస్తున్నా. సొంతిల్లు లేదు.
అద్దె ఇంటి యజమాని నిత్యం ఏదోరకంగా ఇబ్బందులు. ఎవరెవరో వచ్చి అర్ధరాత్రి పూట తలుపులు కొడుతుంటారు. రక్షణ లేకుండా పోయింది. పోలీసులకు చెప్పినా పట్టించుకోరు. ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తే ఏదో చిన్న కిరాణాకొట్టు, హోటల్ పెట్టుకుని బతుకుతాం. మాకూ గర్వంగానే బతకాలని ఉంది.. ’’ఇదీ మహబూబ్‌నగర్‌కు చెందిన రాగిణి (పేరు మార్చాం..) ఆవేదన.
‘‘ ఒకప్పుడు మంచిగా బతికిన కుటుంబం మాది.. భర్త నన్ను వది లేసిండు. పిల్లల చదువు, వారి పెంపకం కోసమే ఈ పడుపుపనిలోకి వచ్చిన. అమ్మానాన్నల పోషణ నేనే చూ సుకుంటున్న. వారి మందుల రోజుకు వందలైతయి. ఇంత సొమ్ము ఎక్కడినుంచి తేను. అందుకే తెలిసిన వారిలో ఈ పనిలోనే ఉన్నా. మేం చేసే పని మంచి ది కాదనిపించినా తప్పడం లేదు. ఒక్కోసారి ప్రా ణం పోయినంత పనైతది. రోజుకు రూ.400 సంపాదిస్తుంటాను. ఒక్కోరోజు అసలే దొరకవు. దొరికిన రోజు అవి చేతికొస్తవనే నమ్మకం లేదు. పోకిరీల నుంచి పోలీసుల వరకు ఎవరి కంట్ల పడినా నరకమే..! మాకు మారాలని ఉన్నా..లోకం మమ్మల్ని ఈ వంకనే చూస్తుంది’’ అంటూ చిట్టి(పేరు మార్చాం..) కళ్లనిండా సుడులు తిరిగిన నీళ్లను అదిమిపట్టిన తన బాధను చె ప్పుకొచ్చింది. ఈ కష్టాలు ఏ ఒక్క రాగిణి, చిట్టిది మాత్రమే కావు. పడుపు వృత్తిలో ఒళ్లమ్ముకుని బతుకుజీవుడా..! అంటూ నిత్యం క్షోభ అనుభవిస్తున్న ఐదువేల మంది జీవనగాథ. కట్‌చేస్తే..!
జిల్లాలో సుమారు ఆరువేల మంది మహిళలు ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ సర్వే అంచనా. అనధికారంగా మరో 15వేల మంది ఉండొచ్చని తెలుస్తోంది. వీరిలో జిల్లాకేంద్రంలోనే 1300 మంది ఉన్నట్లు లెక్క. జడ్చర్లలో 240, కొత్తకోట ప్రాంతంలో 200, వనపర్తి, నారాయణపేట ప్రాంతాలతో పాటు షాద్‌నగర్ లాంటి ప్రాంతాల్లో 300 మంది ఫిమేల్‌సెక్స్‌వర్కరుల ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగి స్తున్నారు. వీరు ప్రధానంగా 44వ జాతీయ రహదారిని అడ్డాగా చేసుకుని బతుకీడుస్తున్నారు.
కొత్తూరు మొదలుకుని అలంపూర్ చౌరస్తా వరకు అనేక ప్రాంతాల్లో బస్టాండ్‌లు, కల్లు కంపౌడ్స్, లాడ్జీలు, ఇతర నిర్జల ప్రదేశాలను కేంద్రాలుగా ఈ పడుపువృత్తిని కొనసాగుతున్నారు. అయితే ఈ వృత్తిలోకి వచ్చే సం ఖ్య ఏటా 5 శాతం చొప్పున పెరుగుతోందని స ర్వే చెబుతోంది. వేశ్యావృత్తి లో ఉన్న వారిలో చాలామంది 17 నుంచి 25 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. సెటిల్‌మెంట్లలో తేడా రావడంతో సెక్స్‌వర్కర్లు హత్య కు గుర వుతున్నారు. ఈ పరంపరలో ఆర్నెళ్ల క్రితం జడ్చర్ల సమీపంలో ఒక రు, నవాబ్‌పేట అడవిలో మరొకరిని, అప్పన్నపల్లిలో ఇంకొకరిని హతమార్చిన సంఘటనలు ఉన్నాయి. ఈ కేసుల మిస్టరీ ఇంకా వీడలేదు.
నిత్యం నరకం.. లేదు సుఖం
‘ ఈ పనిలో మా మానప్రాణాలను ఫణంగా పెడుతున్నాం. ఒక్కోసారి ఒకరు లేదా నలుగురు బలత్కరించడంతో ప్రాణాలు పోతున్నయ్. మద్యం వద్దంటే తాగించి నీచమైన చర్యలకు దిగుతున్నా.. పాణం హునం చేసుకుని లొంగిపోతున్నాం’ అని రాగిణి చెబుతుంటే వారు నిత్యం ఎంత నరకం అనుభవిస్తున్నారు. ‘ శారీరకంగా లొంగదీసుకున్న తరువాత ముందే మాట్లాడుకున్న డబ్బులు ఇవ్వమంటే తీవ్రంగా కొట్టిండ్రు. ఒంటి మీద ఉన్న పుస్తెకూడా లాక్కున్నారు.’ అని మరో మహిళ ఆవేదన వారి క్షోభకు అద్దంపడుతోంది. అయితే ఈ పడుపువృత్తిలో కొనసాగుతున్న వారిలో ఎక్కువమంది గ్రామీణప్రాంతాల నుంచి వచ్చినవారే ఉంటున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన వారు కొందరైతే, భర్త, ఇతర సంబంధికులెవరూ లేనివారు ఈ వృత్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఏళ్లపాటు ఉపాధి కోసం దూరప్రాంతాలకు వలసవెళ్లి తమపిల్లల బాగోగులను పట్టించుకోకపోవడంతో వారు కూడా ఈ వృత్తిలోకి వస్తున్నారు. టీనేజీ వయస్సులో ఆకర్షితులవుతున్నవారూ ఉన్నారు. పోలీసుల కంటపడిన సమయంలో వారు తమకు రక్షణ కల్పించాల్సిపోయి.. తమవద్ద ఉన్న డబ్బులను లాక్కుంటున్నారని బాధిత మహిళలు ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది అనేకరకాల వ్యాధులతో సతమతమవుతున్నారు. వీరిలో 34మంది ెహ చ్‌ఐవీ పాజిటివ్ తేలినవారు ఉన్నారు. వారు సరైన ఆహారం లేక.. వైద్యం చేయించుకోవడానికి చేతిలో చిల్లిగవ్వలేక అదే వృత్తిలో మగ్గుతున్నారు.
వారి జీవితాలను బాగుచేయాలి
పడుపువృత్తిలోనుంచి వారంతా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి పునరావాసం
కల్పిస్తే మేలు చేయడంతోపాటు మంచి సమాజాన్ని నిర్మించేందుకు వీలవుతుంది. జిల్లా అధికారులతోపాటు ప్రభుత్వం ముందుకొచ్చి వారి బాధలు పడేవారి జీవితాలను బాగుచేయాల్సిన అవసరం ఉంది.
మా సొంత ఖర్చులతో ఈ వృత్తిలో ఉన్న కొంతమందికి వైద్యచికిత్సలు అందజేస్తున్నాం. క్రమం తప్పకుండా మందులు పంపిణీ చేస్తున్నాం. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ ప్రయత్నమే ప్రభుత్వం చేస్తే బాగుంటుంది.
- బ్లెస్సీ, సోషల్‌వర్కర్, ఎంబీడీఓ స్వచ్ఛంద సంస్థ,
మహబూబ్‌నగర్
బాధితులు ఆశిస్తున్న సహాయం
కూరగాయల వ్యాపారం, హోటళ్లు, మేకలు, గొర్రెల పెంపకం, గేదెలతో పాడి పరిశ్రమ, కుట్టుమిషన్‌లు, గాజుల దుకాణం, లేడీస్‌కార్నర్ నిర్వహణకు రుణాలు ఇవ్వాలని ఫీమేల్ సెక్స్‌వర్కర్లు కోరుతున్నారు. స్థలం కేటాయించటంతోపాటు ఇంటి నిర్మాణం చేపట్టాలి.
రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులతోపాటు ఆరోగ్యశ్రీకార్డును ఇవ్వాలి. తమ పిల్లలకు అన్ని విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించాలి. వృద్ధులకు నెలకు రూ.2000 పింఛన్ సౌకర్యం కల్పించాలి.
స్వచ్ఛంద సంస్థల అండదండలు
ఈ వృత్తిలో సహేళి మహిళాసంఘం ఏర్పాటు చేసుకున్నారు. 2001లో ఆరుగురితో ఏర్పాటయిన జడ్చర్ల సంఘంలో ప్రస్తుతం 37మంది సభ్యులుండగా, మహాబూబ్‌నగర్‌లో 1300మంది సభ్యులున్నారు. జిల్లాలో సీఏఆర్‌డీఎస్( కలెక్షన్ ఫర్ రూరల్‌డెవలప్‌మెంట్ సొసైటీ), ఎంఆర్‌డీఎస్(మదర్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ), ఎంబీడీఓ(మినిమల్ బ్రదర్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) వేశ్యవృత్తిలో కొనసాగుతున్న మహిళలకు అండదండలు అందస్తున్నాయి.
వారికి హెచ్‌ఐవీ వ్యాప్తిపై అవగాహన కల్పించడంతో పాటు నిరోధ్‌లు పంపిణీచేస్తున్నాయి. నిపుణులైన వైద్యుల చేత వారం వారం వైద్యపరీక్షలు చేయించడంతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. సమాజంపై అవగాహన కల్పిస్తూ.. వారిలో మార్పును తీసుకొచ్చేందుకు విశేషంగా కృషిచేస్తున్నారు.
మేమేమి చేశాం నేరం
Published Wed, Aug 6 2014 3:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement